
డాక్టర్ రాకేశ్ మిశ్రా
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ని ఎదుర్కొనేందుకు ఒకవైపు టీకా తయారీ ప్రయత్నాలు జోరుగా సాగుతుం డగా, మరోవైపు ఇప్పటికే వ్యాధి బారినపడ్డ వారికి చికిత్స అందించే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సిద్ధమవుతోంది. ఈ క్రమం లో ఇప్పటికే పలు వైరల్ వ్యాధుల చికిత్స ఉపయోగిస్తున్న మందులు కోవిడ్‌కూ పనికొస్తాయేమోనని పరిశీలిస్తోంది. వీటిల్లో స్మాల్‌పాక్స్ కోసం వాడే మందులతోపాటు మరో 11 మందు లు ఉన్నట్లు తెలిసింది. స్మాల్‌పాక్స్ మందు, ఉబ్బసం రోగులకు ఇచ్చే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందు ఒకటి కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతున్నట్లు ప్రాథమిక అంచనాల ద్వారా తెలిసింది.
ఎంపిక చేసిన మందులు కరోనా రోగుల్లో ఎంతవరకు సురక్షితమనే విషయంలో ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తి కాగా, మూడో దశ ప్రయోగాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మందులు జంతువులతోపాటు మనుషులపై కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈ మందులపై కొన్ని ప్రయోగాలు జరుగుతున్న కారణంగా వాటి పేర్లను వెల్లడించలేమన్నారు. కరోనాకు వ్యతిరేకంగా వీటి సామర్థ్యం నిరూపితమైతే ఆయా కంపెనీలు తయారీ కోసం డ్రగ్ కంట్రోలర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీటిని కోవిడ్ కారక వైరస్‌పై కూడా ప్రయోగించి చూస్తున్నట్లు తెలి సింది. తద్వారా వ్యాధి ముదిరిన వారి ని కూడా ఈ మందుల ద్వారా రక్షించగలమా? అన్నది నిర్ధారించుకుంటోంది.
మందుల తయారీకి సెల్ కల్చర్
కరోనా దేశంలో అడగుపెట్టినప్పటి నుంచి సీసీఎంబీ తక్కువ ఖర్చుతో వ్యాధి నిర్ధారణకు సరికొత్త పరీక్షలు సిద్ధం చేయడంతోపాటు కరోనా వైరస్‌తో కూడిన కణాలను పరిశోధనశాలలోనే అభివృద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు అందించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తోపాటు చికిత్సకు అవసరమయ్యే మందుల తయారీకి కూడా ఈ సెల్ కల్చర్ ఎంతో ఉపయోగపడుతుంది. కరోనా వ్యాధి చికిత్స కోసం ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు రెమిడెస్‌విర్, ఫావాపిరవిర్ వంటి అనేక మందులు ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు.
ఈ వ్యాధి కోసమే ప్రత్యేకమైన మందులు లేకపోవడం దీనికి కారణం. అందుకే సీసీఎంబీ ఇప్పటికే ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసిన మందులను కోవిడ్–19కూ పనికొస్తాయా? అన్నది పరిశీలిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆవ్రా ల్యాబ్స్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రాంతాల కంపెనీలు ఈ మందులను పరీక్షించాల్సిందిగా సీసీఎంబీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మందులు కరోనాపై కూడా సమర్థంగా పనిచేస్తే... పేటెంట్లేవీ లేని నేపథ్యంలో వీటిని చాలా చౌకగా ఉత్పత్తి చేసి అందరికీ అందించవచ్చునని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment