
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్‌ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు దక్షిణాదికి కూడా విస్తరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు ఏర్పడుతుందనే ప్రధాని నరేంద్రమోదీ వెనక్కి తగ్గారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్‌కు దేశంలోనే అత్యంత ప్రజాదరణ, పాలనాప్రజ్ఞ, దక్షత ఉండటం, వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడంతో కేంద్రంలో చలనం వచ్చిందన్నారు. అన్నిభాషల మీద పట్టుకలిగిన కేసీఆర్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోదీ ప్రభుత్వానికి తెలుసని, అందుకే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని, రైతుల పోరాటంలో కాంగ్రెస్‌పాత్ర ఇసుమంత కూడా లేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల ద్వారా యువతను సాగు వైపు మళ్లించాలని సూచించారు. విద్యుత్ చట్టాలను కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రమే వడ్లు కొనేలా చట్టం తేవాలి: ఎంపీలు
కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసేలా చట్టం తీసుకురావాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు, నూతన వ్యవసాయచట్టాలపై సీఎం కేసీఆర్ ఆందోళనకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ ఎంపీలు రం జిత్‌రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేతతో కలసి శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ చట్టాలపై కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి వడ్లను కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తీసుకురావాలన్నారు.