
సాక్షి, హైదరాబాద్: రిఫ్రిజిరేటర్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటివి పాడైపోతే ఏం చేస్తాం? మరమ్మతు చేయించుకుని వాడుకుంటాం. లేదా కొత్తవి కొనుక్కుంటాం. అదే మన శరీరం లోని ఏదైనా అవయవం పాడైతే..? మందు లేసుకునో, శస్త్ర చికిత్స చేయించుకునో పనిచేసేలా చూస్తాం. చాలా అరుదుగా అవయవ మార్పిడి తప్ప మార్కెట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన అవయవాన్ని తెచ్చి అమర్చు కునే పరిస్థితి లేదు.
కానీ అలాంటి వెసులుబాటు ఉంటే, మనకు కావాల్సిన అవయవాన్ని తయారు చేసుకోగలిగితే? ఇలాంటి అద్భుతం సాకారమయ్యేందుకు మార్గం సుగమమైంది! చైనాలోని ట్సింగ్‌హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూలకణాలపై ఈ మేరకు జరిపిన ఓ ప్రయోగం విజయవంతమైంది.
మూలకణాలే మూలం..
అవయవాల తయారీ ఎలా అన్న విషయాన్ని తెలుసుకునే ముందుగా మనం మూలకణాల గురించి కొంత అర్థం చేసుకోవాలి. పిండ దశ నుంచి బిడ్డ పుట్టి ఎదిగేంతవరకూ మానవ అవయవాల్లో మూల కణాలు ఉంటాయి కానీ.. వేటి లక్షణాలు వాటివే. పిండంలో ఉండే కణాలనే ఉదాహరణగా తీసుకుంటే అవి గర్భంలో ఉన్న దశలో అన్ని రకాల కణజాలాలు, అవయవాలుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
బిడ్డ పుట్టిన తరువాత.. ఎదిగిన తరువాత మాత్రం ఒక్కో అవయవంలో అత్యల్ప స్థాయిలో ఉండే మూలకణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవు. అంటే మూత్రపిండంలోని మూల కణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవన్న మాట! అయితే పిండదశలో ఉన్న మూలకణం గుండె గానూ మారగలదు. మూత్రపిండంగానూ తయారు కాగలదు. ఉమ్మినీరు గానూ మారగలదు. వీటిని టూటీపోటెంట్ స్టెమ్‌సెల్స్ అని పిలుస్తారు.
స్థూలంగా చెప్పాల్సి వస్తే... నాలుగైదు రోజుల వయసున్న పిండంలోని కణాలే ఈ టూటీ పోటెంట్ కణాలు. ఆ తరువాత కొంత సమయానికి ఇవి శరీరంలోని వేర్వేరు కణాలుగా మారగల సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. వీటిని ప్లూరీపోటెంట్ స్టెమ్‌సెల్స్ అని పిలుస్తారు. పిండంలో అవయవాలు ఏర్పడటం మొదలైన తరువాత వాటికేదైనా నష్టం జరిగితే సరిచేసేందుకు వీలుగా కొన్ని మూలకణాలు ఉంటాయి. అవి ఆ అవయవ కణాలుగా మాత్రమే మారగలవు. వీటిని మల్టీపోటెంట్ కణాలు అంటారు.
పిండం కూడా సృష్టించొచ్చు!
ఇవి ఏ అవయవంగానైనా మారగలవని ముందే చెప్పుకున్నాం కదా. ఆ విధంగా సుదూర భవిష్యత్తులో నిస్సంతులకు వీర్యం, అండాల అవసరం లేకుండా పిండాన్ని సృష్టించేందుకు కూడా ఈ టెక్నాలజీ పయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పిండాన్నే సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు అవసరమైన అవయవాల తయారీ పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మరింత క్షుణ్ణంగా పరిశోధనలు జరపడం ద్వారా ఫలితాలను మరింత కచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మూలకణాలను మార్చేశారు
చైనా వర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల అవయ వాల్లోని మల్టీ పోటెంట్ మూలకణాలను తీసుకుని.. రసాయన మిశ్రమం సాయంతో టూటీపోటెంట్ కణా లుగా మార్చేశారు. ఇంకోలా చెప్పాలంటే.. పిండ దశలో ఉన్న మూలకణాల మాదిరి మార్చేశారన్నమాట. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మల్టీపోటెంట్ కణా లను ప్లూరీపోటెంట్ కణాలుగా మార్చడంలో విజ యం సాధించారు కానీ.. టూటీపోటెంట్ కణా లుగా మార్చడం మాత్రం ఇదే తొలిసారి.
ఇందు కోసం వారు కొన్ని వేల పరమాణువుల మిశ్రమా లను పరీక్షించి చివరకు మూడింటిని గుర్తించారు. టీటీఎన్‌పీబీ, 1–అజాకెన్‌పాల్లోన్, డబ్ల్యూఎస్6 అని పేర్లు పెట్టిన ఈ మూడు రసాయనాలు ఎలుకల్లోని ప్లూరీపోటెంట్ కణాలను టూటీపోటెంట్ కణాలుగా మార్చగలవని నిర్ధారించుకున్నారు. ఎలుకల పిండాల్లో, పరిశోధన శాలలు రెండింటిలోనూ జరిపిన పరిశోధనల ద్వారా వీటి లక్షణాలన్నీ టూటీపోటెంట్ కణాల మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమైంది.