సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పాతాళ భైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకువస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా వచ్చాకా కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా బంద్ అయ్యిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం ఆయన జూమ్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు.. కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది సమయం ఉన్నా రాష్ట్రంలో కనీసం ఆక్సిజన్ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజులు నియంత్రణ చేసిందో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు.
‘‘కరోనా పెరుగుతున్న సమమంలో చీఫ్ సెక్రెటరీతో ఫోన్ చేసి మాట్లాడాను.. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. దున్న పోతుమీద వాన పడుతున్నా కదిలే పరిస్థితి లేదు. ఫామ్ హౌస్‌లో నిద్రిస్తోంది. మంత్రులెవరూ స్పందించడం లేదు. కనీసం బ్యూరోక్రసీతో పనిచేయించడం నీ బాధ్యత అని సీఎస్‌తో చెప్పి 15 రోజులైనా ఆయన స్పందించింది లేదు’’ అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాపై పూర్తిస్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలి కానీ.. గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి ప్రశ్నించారు. సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన కరోనా బాధితులకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదన్నారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత? అనే దానిపై ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని భట్టి అన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న చీఫ్ సెక్రెటరీ కూడా ఈ వివరాలు చెప్పడం లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
చదవండి: ఆత్మగౌరవం పేరిట కొత్త నాటకం: మంత్రి గంగుల
లాక్‌డౌన్.. అంతంత మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment