సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. నేడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్పీ)పై మరోసారి సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే, బోర్డులో ఉన్న మిగతా సభ్యులు కూడా నేడు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బోర్డు పూర్తి స్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. టీఎస్‌పీఎస్పీ పరీక్షలన్నింటినీ రీ షెడ్యూల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ జరుగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్పీ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రాజీనామాకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని జనార్ధన్‌రెడ్డి కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment