బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ
సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్‌లో కుంగిపోయింది
భవిష్యత్తులో బరాజ్‌కు ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి వస్తుంది
సీఎం సోదరులు ఏం చేస్తున్నారో తెలుసు.. అన్నీ బయట పెడతాం
కన్నెపల్లి నుంచి పంపింగ్ కోసం ఆగస్టు 2 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపణలు చేశారు. ‘లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న బరాజ్.. సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్‌లో కుంగిపోయింది. భవిష్యత్తులో బరాజ్‌కు ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ కుట్ర అని భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్‌ను వారు ఏమైనా చేయగలరు’అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో కేటీఆర్ శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సీఎం సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి చేస్తున్న వ్యవహారాలను సరైన సందర్భంలో బయటపెడతాం. ఉదయసింహ, ఫహీమ్ ఖురేíÙ, అజిత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు. ఎక్కడేం జరుగుతోందో మాకన్నీ తెలుసు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అడ్డుపెట్టుకొని నీళ్లు ఎత్తిపోయడం లేదు.
మేడిగడ్డపై కాంగ్రెస్, బీజేపీ ఒకే వైఖరితో ఉన్నాయి. బీజేపీ చెప్పినట్లుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నడుచుకుంటున్నారు. పోలవరం కాఫర్‌డాం కొట్టుకుపోయినప్పుడు ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఏమైంది? భేషజాలకు వెళ్లకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుంటే ఆగస్టు 2 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన?
ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళనకు రూ. 1.50 లక్షల కోట్లు ప్రతిపాదిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చాలని ఎంఐఎం ఒత్తిడి చేసినందునే పాతబస్తీలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఎల్ అండ్ టీ తీరుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సందేశం వెళ్తుందని చెప్పారు. భూసేకరణలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ ప్రతిపాదించామని కేటీఆర్ చెప్పారు.
షావలీ దర్గాపై గత ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు భిన్నంగా రేవంత్ వెళతారా? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి వివిధ పథకాలకు, పనులకు పేర్లు మార్చే పిచ్చి ఉందని, హైడ్రా కూడా అందులో భాగమేనన్నారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదన్నారు.
ఎనిమిది సీట్లు ఇస్తే ఏమిచ్చారు..?
తెలంగాణ ప్రజలు బీజేపీని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో గెలిపించినా రాష్ట్రానికి మాత్రం ఒరిగిందేమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘బీజేపీకి అత్యంత క్లిష్టమైన సమయంలో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రోరైలు విస్తరణకు నయాపైసా ఇవ్వలేదు’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment