సాక్షి, కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ నేత తీరుతో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఇటీవల గుండెపోటుతో మరణించిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణమని ఆరోపిస్తూ పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం జమ్మికుంట, హుజురాబాద్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, సేవలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డిని భట్టి విక్రమార్క వారించినా వినకుండా సూపరింటెండెంట్ వైపు వేలు చూపుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏం డాక్టర్‌వయ్యా...దిమాక్ ఉంటా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మర్డర్ కేసు నమోదు చేయించి, సస్పెండ్ చేసే వరకు ఊరుకోమంటూ సూపరిండెంట్‌పై కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌ను సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించడంతో మానసిక ఆందోళనతోనే అతడికి గుండెపోటు వచ్చిందని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, సూపరింటెండెంట్ కలిసి ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు ఆసుపత్రికి వస్తే కేసులు పెట్టి వేధిస్తారా.. నీ అంతు చూస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment