సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొత్త ఏడాది తొలినాళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరో మూడు నెలల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పది, పదిహేను రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు, రాష్ట్ర ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణచేసిన హైకమాండ్ పెద్దలు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక పేరును, బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురి పేర్లను పరిశీలిస్తోంది.
కష్టకాలంలో నిలబడిన తనను గుర్తించాలంటున్న భట్టి
ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన మాదిరే తనకు కూడా ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. పీసీ సీ అధ్యక్షుడిగా మల్లు అనంతరాములు చేసిన సేవలతో పాటు సీఎల్పీ నేతగా తా ను కష్టకాలంలో నిలబడిన తీరును పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం.
బీసీ వర్గానికే ఎక్కువ చాన్స్...
ప్రస్తుతం ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం అయినందున పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనే డిమాండ్ సైతం బలంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న హైకమాండ్ బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పొన్నం ఇప్పటికే మంత్రిగా కొనసాగుతుండటం, మధుయాష్కీ ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దృష్ట్యా, మహేశ్ గౌడ్, వీహెచ్‌ల పేర్లపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఆ ఇద్దరిలో ఒకరికి రేవంత్ మద్దతు?
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహేశ్ గౌడ్, వీహెచ్‌లలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. మొత్తంగా ‘జనవరి రెండో వారానికల్లా తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రావొచ్చు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలన చేస్తోంది. బీసీ సామాజిక వర్గ నేతను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి’అని ఏఐసీసీలోని కీలక నేత ఒకరు వెల్లడించారు.
తెలంగాణ కొత్త పీసీసీపై కాంగ్రెస్ ఫోకస్.. భట్టికా.. బీసీకా?
Published Thu, Dec 28 2023 4:58 AM | Last Updated on Thu, Dec 28 2023 10:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment