ఇక పైకప్పులన్నీ కూల్‌కూల్‌గానే  | Coolroof policy in 2.675 sq km this year | Sakshi
Sakshi News home page

ఇక పైకప్పులన్నీ కూల్‌కూల్‌గానే 

Published Sun, Apr 9 2023 2:11 AM | Last Updated on Sun, Apr 9 2023 2:11 AM

Coolroof policy in 2.675 sq km this year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల ఒకటోతేదీ నుంచి అమలులోకి వ చ్చిన కూల్‌రూఫ్‌ పాలసీని రాబోయే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్ల మేర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పైకప్పుల కంటే కూల్‌ రూఫ్‌ సూర్యుడి నుంచి తక్కువ వేడిని తీసుకుంటుంది. ఇది సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, థర్మల్‌ రేడియేషన్‌ను విడుదల చేసి, వేడిని తగ్గిస్తుంది.

సాధారణ పైకప్పులు 20 శాతం సూర్యరశ్మిని మాత్రమే తిరిగి ప్రతిబింబిస్తే, కూల్‌ రూఫ్‌లు దాదాపు 80 శాతం సూర్యరశ్మిని రిఫ్లెక్ట్‌ చేస్తాయి. తద్వారా కూల్‌రూఫ్‌లతో భవనాలు గణనీయంగా చల్లబడతాయి. ఈ కూల్‌రూఫ్‌ విధానాన్ని 2023–24లో జీహెచ్‌ఎంసీలో 5 చ.కి.మీ మేర... మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 2.675 చ.కిమీల మేర అమలు చేయాలని నిర్ణయించారు.

జీహెచ్‌ఎంసీ మినహా మిగతా పట్టణాల్లో ఈ సంవత్సరం కూల్‌రూఫ్‌ పాలసీ అమలుకు సంబంధించిన విధి విధానాలను, విస్తీర్ణం వివరాలతో సీడీఎంఏ ఎన్‌. సత్యనారాయణ శనివారం ఒక సర్క్యులర్‌ విడుదల చేశారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 3,468 వార్డుల్లో తొలి ఏడాది ఇంటి పైకప్పులను చల్లబరిచే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 287.9 లక్షల చదరపు అడుగుల మేర ఇంటి పైకప్పులను కూల్‌రూఫ్‌ పాలసీ కిందికి తీసుకురానున్నారు. 

ఏ ఇళ్లకు కూల్‌రూఫ్‌ విధానం తప్పనిసరంటే... 
600 చదరపు గజాలు, అంతకు పైబడిన స్థలాల్లో నిర్మించే గృహ నిర్మాణాల అనుమతులకు ఇక నుంచి కూల్‌రూఫ్‌ పాలసీ తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో కూల్‌రూఫ్‌ విధానంలో నిర్మించిన వాటికి మాత్రమే పురపాలక శాఖ ఆక్యుపెన్సీ సరి్టఫికెట్‌ ఇవ్వనుంది. ఇక అన్ని ప్రభుత్వ భవనాలు కూల్‌ రూఫ్‌ విధానంలోనే నిర్మాణం జరగాలి. సైట్‌ ఏరియా, బిల్డప్‌ ఏరియాతో సంబంధం లేకుండా అన్ని రకాల నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్‌ పాలసీ తప్పనిసరి.

అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ ఇదే విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక 600 చదరపు గజాలకన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస గృహాలకు కూల్‌రూఫ్‌ పాలసీ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే కూల్‌ రూఫ్‌ విధానంలో నిర్మించకపోయినా, అనుమతులకు ఇబ్బందులేం ఉండవు. ఇంటి పైన సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకున్న వారు సైతం శీతలీకరణ కోసం కూల్‌రూఫ్‌ విధానంలోకి మారే ఆప్షన్‌ ఉంటుంది. వచ్చే మూడేళ్లలో నివాసేతర గృహాలకు రెట్రా ఫిట్టింగ్‌ చేసుకోవడం కూడా ఆప్షన్‌గా సీడీఎంఏ పేర్కొంది.  

పాత ఇళ్లకు కూల్‌రూఫ్‌ ఎలా..? 
ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న నివాసాలను కూడా కూల్‌రూఫ్‌ విధానంలోకి తీసుకువచ్చేలా విధివిధానాలను రూపొందించారు. ఇందుకోసం ఆయా మునిసిపాలిటీల్లోని వార్డుల్లో నిర్దేశించిన విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఇళ్లకు కూల్‌రూఫ్‌ను తప్పనిసరి చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయనుంది. ఆయా ఇళ్ల పైకప్పులకు సోలార్‌ రిఫ్లెక్టివ్‌ పెయింట్‌ చేస్తారు. తెల్లటి టైల్స్‌తో లేదా తెల్లటి పొరతో పైకప్పులను కప్పి పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించాలనేది నిర్ణయం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement