సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజుల తర్వాత ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఒకరు నిమ్స్‌కు చెందిన రెసిడెంట్ డాక్టర్ కాగా, మరొకరు ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారు టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత వైరస్ ఏమీ చేయదన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు తెలిసింది. మాస్క్ ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించకపోవడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ అంశాన్ని గుట్టుగా ఉంచుతున్నారు.
42 రోజుల తర్వాతే యాంటీబాడీస్..
దేశవ్యాప్తంగా జనవరి 16న తొలి విడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు తొలి డోసు టీకాలు ఇచ్చారు. కోవిడ్ టీకాల పనితీరుపై నమ్మకం లేకపోవడం, టీకా తీసుకున్న తర్వాత అలర్జీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండటంతో 50 శాతం లబ్ధిదారులు టీకాకు దూరంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి తొలి డోసు టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా ఇస్తారు. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అంటే 42 రోజుల తర్వాత యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో వృద్ధి చెందుతాయి. అప్పటివరకు కోవిడ్ నిబంధనలన్నీ పాటించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే చాలామంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
సురక్షితమే అయినా వీడని అనుమానాలు..
కోవిడ్ నియంత్రణ కోసం అనుమతులు పొందిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు రెండూ సురక్షితమైనవే. అయితే వైద్యులు, సాధారణ ప్రజల్లో వీటి పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. దీంతో టీకా తీసుకునేందుకు ఆశించిన స్థాయిలో ముందుకు రావట్లేదు. కోవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రంలోనే హైదరాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీకా తీసుకున్న 20 రోజులకు పాజిటివ్!
Published Sun, Feb 14 2021 8:05 AM | Last Updated on Sun, Feb 14 2021 12:45 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment