చలికాలంలో చుక్కలే..! | Covid-19‌ is likely to boom further in the winter | Sakshi
Sakshi News home page

చలికాలంలో చుక్కలే..!

Published Mon, Sep 21 2020 5:01 AM | Last Updated on Mon, Sep 21 2020 7:39 AM

Covid-19‌ is likely to boom further in the winter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల్లో లక్షణాలు, మరణాల సంఖ్యను చూస్తే వైరస్‌ తీవ్రత పెరగడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగని తీవ్రత తగ్గిందని నిర్ధారణ జరగలేదంటున్నారు. ఇప్పటివరకు వైరస్‌ 15 రకాలుగా రూపాంతరం చెందింది. కానీ వాటి మధ్య 99.9 శాతం సారూప్యత ఉండటం వల్లే (అత్యంత తక్కువ తేడా) ఈ గందరగోళమని అమెరికాలోని టెక్సాస్‌ హెల్త్‌ రిసోర్సెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ బూచిపూడి రామిరెడ్డి అంటున్నారు. అలాగే చలికాలంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించడం ఖాయమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాకు సంబంధించి పలు తాజా అంశాలపై ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

సాక్షి: కరోనా రెండో దశ మొదలైందని అనుకోవచ్చా?  
డాక్టర్‌ రామిరెడ్డి: మనం ఇంకా మొదటి దశలోనే ఉన్నాం. రెండో దశ అంటే.. మొదటి దశలో వైరస్‌ గణనీయంగా తగ్గిపోయి, తిరిగి మళ్లీ రెండోసారి పుంజుకోవడం. స్వైన్‌ ఫ్లూ ఎలాగో ఇది కూడా శాశ్వతంగా ఉంటుందనేది శాస్త్రవేత్తల అంచనా.  

వైరస్‌ చలికాలంలో విజృంభిస్తుందా?  
తప్పకుండా విజృంభిస్తుంది. ఇప్పుడు అందరూ భయపడేది అదే. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. అమెరికాలో ఈ నెల రెండో వారం నుంచే శీతాకాలం ప్రారంభమైంది. దీంతో ఈ ఐదారు రోజుల్లోనే అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల 13 శాతం ఉంది. ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి. కానీ జనం వదిలేశారు. వచ్చే శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  

కొందరిలో నెలల తరబడి వీక్‌నెస్‌ ఉండటానికి కారణమేంటి?  
మూడు నెలల తర్వాత కూడా నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దాన్ని ‘పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌’అని పేరు పెట్టారు. అయితే ఇవి సహజంగా చాలామందిలో ఉంటున్నాయి. ఇటువంటి వారు మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. పొగతాగడాన్ని నిలిపివేయాలి. 

జంతువులకు కరోనా సోకుతుందా?  
కుక్క నుంచి మనుషులకు కరోనా వ్యాపించిన కేసు న్యూయార్క్‌లో నమోదైంది. కుక్కలు, పిల్లుల నుంచి మనుషులకు కరోనా వ్యాపించే అవకాశం ఉంది. అలా వైరస్‌ రూపాంతరం చెందుతుందని అనుకోవచ్చు. కోళ్లు, పందులకు మాత్రం కరోనా వ్యాపించదని తేలింది. ఇక ఆహారం, నీరు, ఇతర జంతువుల ద్వారా కరోనా రాదు. కరోనా వచ్చినవారు ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్కలు, పిల్లులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలి.  

కరోనా వచ్చినవారికి స్టెరాయిడ్స్‌ ఏ పరిస్థితుల్లో వాడాలి?  
ప్రస్తుతం రెమిడిసివీర్, స్టెరాయిడ్స్‌ మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. లక్షణాలు వచ్చి ఆక్సిజన్‌ తగ్గుతున్న సమయంలో రెమిడిసివీర్‌ పనిచేస్తుంది. స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల మరణాల రేటు తగ్గుతుంది. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలతో ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చారు. 

కరోనా రీ–ఇన్ఫెక్షన్‌ ను ఎలా నిర్ధారించాలి?  
హాంకాంగ్‌లో ఒక కేసు... ఇండియాలో ఇటీవల ఆరు కేసుల్లో రీ–ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. మొదటిసారి వచ్చిన వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ (జన్యుపదార్థం), రెండోసారి వచ్చిన వైరస్‌ ఆర్‌ఎన్‌ఏకు భేదం ఉన్నట్లు వైరాలజీ పరీక్షలో గుర్తిస్తేనే రీ–ఇన్ఫెక్ట్‌ అయినట్లు లెక్క. కొందరిలో డెడ్‌ వైరస్‌ ఉండటం లేదా వచ్చిపోయాక అత్యంత తక్కువగా వారిలో వైరస్‌ ఉంటుంది. అప్పుడు కూడా కరోనా పాజిటివ్‌ చూపిస్తుంది. 

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లో లోపం ఎక్కడ జరిగింది?  
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సమయంలో సంబంధిత వ్యక్తులకు న్యూరాలజీ ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. రెండు కాళ్లు చచ్చుపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించారు.  

వ్యాక్సిన్‌ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది?  
గవదబిళ్లల వ్యాక్సిన్‌కే నాలుగేళ్లు పట్టింది. ఇదే వైద్య చరిత్రలో వేగంగా అభివృద్ధి అయిన వ్యాక్సిన్‌ . మిగిలినవన్నీ ఎక్కువ సమయం పట్టాయి. కరోనా వ్యాక్సిన్‌ రావడానికి ట్రయల్స్‌ మొదలైనప్పటి నుంచి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. రష్యా తీసుకొచ్చిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ప్రభావంపై అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలు మాత్రమే దీన్ని తీసుకుంటున్నాయి.  

హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకోవచ్చా?  
హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటే 60–70 శాతం జనానికి వైరస్‌ వస్తేనే సాధ్యం. అమెరికాలో 3–4 శాతం మందికే వైరస్‌ వచ్చింది. ఇతర దేశాల్లోనూ ఇలాగే. ఈ పరిస్థితుల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ ఎలా సాధ్యం? హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటే వ్యాక్సినేషన్‌ తోనే జరగాలి. అందరినీ వదిలేస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని అనుకోవడం సరికాదు. ఇక స్కూళ్లు, కాలేజీలు తెరవకపోవడమే మంచిది. 

గర్భిణులకు వైరస్‌ సోకితే ఎటువంటి సమస్యలు వస్తాయి?  
సాధారణంగా 38–40 వారాల్లో డెలివరీ కావాల్సింది, వైరస్‌ వచ్చినవారికి 35–36 వారాల్లోనే డెలివరీ అవ్వొచ్చు. ఇక తల్లికి కరోనా వస్తే బిడ్డకు వస్తుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement