ఏడాది కాలంలో ‘నాలుగో’ సీపీ
11 నెలల్లో మారిన ముగ్గురు అధికారులు
మహారాష్ట్ర తరహాలో డీజీపీ కంటే సీనియర్ కాప్
21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసిన సర్కారు.. కొత్త కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ను తీసుకువచ్చింది. దీంతో ఏడాదిలో ఈయన నాలుగో కమిషనర్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కాగా.. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. మరో విశేషం ఏమిటంటే.. 21 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని సీపీగా నియమించడం. నగరానికి 61వ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.
2021లో తొలిసారిగా నియామకం..
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్లకు డీసీపీ, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేసిన ఆనంద్ 2021లో తొలిసారిగా సిటీ కొత్వాల్ అయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25 నుంచి గత ఏడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించిన సీవీ ఆనంద్... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ 13 వరకు సందీప్ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని శనివారం బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ సీవీ ఆనంద్‌నే కొత్వాల్‌గా నియమించింది.
నగర కమిషనరేట్ చరిత్రలో తొలిసారి..
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 177 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ 1948 సెప్టెంబర్‌లో జరిగిన ఆపరేషన్ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 మంది పోలీసు కమిషనర్లుగా పని చేశారు. కేవలం రెండు సందర్భాల్లోనే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పని చేశారు. ఈసారి ఆ కాలంలో ఏకంగా నలుగురు మారారు. ఆనంద్‌ది పునరాగమనం అయినప్పటికీ... ఈయన నాలుగో అధికారే. 1990లో మాత్రం మత కలహాలు సహా అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు పోలీసులు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇప్పటి వరకు ఏడుగురికే...
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తొలి కొత్వాల్ హసన్ అలీ ఖాన్ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచి్చన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్‌పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు.
చట్టం లేకపోయినా మహారాష్ట్ర తరహాలో..
నగర కొత్వాల్‌గా పునరాగమనం చేసిన ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో పోలీసు విభాగానికి నేతృత్వం వహిస్తున్న పోలీసు బాస్ డాక్టర్ జితేందర్‌ది 1992 బ్యాచ్. ఇలా డీజీపీ కంటే సీనియర్ అయిన అధికారి సిటీ కొత్వాల్‌గా నియమితులయ్యారు. ఈ విధానం ప్రత్యేక చట్టం ద్వారా మహారాష్ట్రలో ఉంది. అక్కడి ప్రత్యేక పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో డీజీపీ కంటే సీనియర్ అధికారినే ముంబై కమిషనర్‌గా నియమిస్తుంటారు. క్షేత్రస్థాయిలోనూ మహారాష్ట్ర డీజీపీ కన్నా ముంబై నగర కమిషనర్‌గా ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఉంటాయి.
ఆదర్శ్‌నగర్ టు ‘బంజారాహిల్స్’..
క్రికెట్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ తదితర క్రీడల్లోనూ తనదైన మార్కు కలిగిన సీవీ ఆనంద్ పూరీ్వకులది రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూరు. ఆనంద్ కుటుంబం మాత్రం ఆదర్శ్‌నగర్‌లో నివసించేది. ఆయన పాతబస్తీలోని ప్రభుత్వ మెటరి్నటీ ఆస్పత్రిలో జని్మంచారు. హెచ్‌పీఎస్ నుంచి మొదలైన ఆయన విద్యాభ్యాసం ఐపీఎస్ వరకు వెళ్లింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీ సీసీసీ), అందులోని పోలీసు కమిషనర్ కార్యాలయం సైతం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఆయన కొత్వాల్‌గా ఉండగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక విభాగాలకు అంకురార్పణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment