సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నమో దైన కేసులో నిందితుల రిమాండ్ కోరుతూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో 40 నిమిషాలపాటు వాదనలు జరిగాయి. గురువారం నిందితుల రిమాండ్ కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. నిరాకరించిన విషయం విదితమే.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం కోసం వచ్చారంటూ అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేసిన పోలీసులు నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వీరిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి న తర్వాతే విచారించాలని సూచించారు. పోలీసుల పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. సుమలత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు.
కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరమని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో ముందే కెమె రాలు ఉన్నాయా?.. మీరు ఏర్పాటు చేశారా?.. కొనుగోలు వ్యవహారం మీకు ముందే తెలుసా? అని ఏజీ న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు పలు చర్యలు చేపట్టి.. అనంతరం దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులను అదుపులోకి తీసుకున్నారని ఏజీ వెల్లడించారు.
నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమా దం ఉందన్నారు. కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వు లు జారీ చేయకపోవడం చెల్లదన్నారు. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టి నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారని, దీనికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని చెప్పారు. సీఆర్‌పీసీలోని 41(1)(బీ) ప్రకారం దర్యాప్తు అధి కారి సక్రమంగానే చేశారన్నారు. అన్ని కేసుల్లోనూ నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ కేసుల భయం ఉండదని ఎమ్మెల్యేలకు భరోసా కూడా ఇచ్చారని చెప్పారు. ఈ ముగ్గురి వెనుక కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉన్నందని.. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు.
ఎలాంటి డబ్బు దొరకలేదు..
నిందితుల తరఫున సీనియర్ న్యాయ వాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారన్నారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లరని హామీ ఇచ్చారు. సమగ్ర వాదనలకు గడువు కావాలని ఆయన కోరడంతో విచారణ నేటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు...
నిందితులు 24 గంటలపాటు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని న్యాయమూర్తి షరతు విధించారు. శుక్రవారం సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమర్పించాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment