
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై లాక్‌డౌన్ ముగిశాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కంటే.. వేచి చూడటం మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరిధిలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో దానికి సమానమైన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలా, వద్దా? అన్న దానిపై ప్రభుత్వం ఇటీవల కసరత్తు మొదలుపెట్టింది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలిస్తే జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించాలంటూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా తెలియజేసింది. అయితే జూలై మధ్య నాటికి ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఏ జాగ్రత్తలు చేపడతాయన్నది పరిశీలించి.. మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.