మెడికల్‌ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్‌ | Direct Flights From Hyderabad Become Major Hubs For Medical Tourism | Sakshi
Sakshi News home page

మెడికల్‌ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్‌

Apr 5 2022 8:43 AM | Updated on Apr 5 2022 8:56 AM

Direct Flights From Hyderabad Become Major Hubs For Medical Tourism - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ టూరిజానికి ప్రధాన హబ్‌గా మారిన హైదరాబాద్‌ నుంచి ఢాకా, బాగ్దాద్‌ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్‌ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. 

ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా..
ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్‌ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. 

చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. 
ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్‌ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్‌ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ మెడికల్‌ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. 

నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు 
వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. 

(చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement