వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితం  | Dr Guru N Reddy Says Coronavirus Vaccine Has No Side Effects | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితం 

Published Mon, Jan 11 2021 1:31 AM | Last Updated on Mon, Jan 11 2021 7:50 AM

Dr Guru N Reddy Says Coronavirus Vaccine Has No Side Effects - Sakshi

ఇప్పుడు దేశమంతటా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై చర్చ నడుస్తోంది. మనదేశంలో ఈనెల 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. వైద్య సిబ్బందికి తొలుత వేయనున్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అక్కర్లేదని, పూర్తిగా సురక్షితమని కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ ప్రమోటర్‌ అండ్‌ డైరెక్టర్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ గురు ఎన్‌. రెడ్డి చెబుతున్నారు. దేశమంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఆయన ఇప్పటికే తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఆయన అనుభవాలతో పాటు వ్యాక్సిన్‌ గురించి కీలకమైన విషయాలు, అపోహలూ, వాస్తవాలను డాక్టర్‌ రెడ్డి ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు... 

సాక్షి: మీరు ఏ వ్యాక్సిన్‌ను, ఎక్కడ తీసుకున్నారు? తీసుకున్న తర్వాత మీ అనుభవం ఏమిటి?  
డాక్టర్‌ రెడ్డి: నేను అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాను. అక్కడ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అనుమతించారన్న విషయం తెలిసిందే కదా. గత డిసెంబర్‌లో నేను వ్యాక్సిన్‌ తీసుకున్నాను. మిగతా వ్యాక్సిన్‌లైతే రెండు డోస్‌ల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉంటుంది. కానీ... ఫైజర్‌ రెండో డోస్‌ మూడో వారం తర్వాత తీసుకోవాలి. నా షెడ్యూల్డ్‌ ప్రకారం మళ్లీ త్వరలోనే వెళ్లి రెండో డోస్‌ కూడా తీసుకుంటా.

ఇప్పుడు మనకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థంగా పనిచేస్తాయి?
అది ఏ వ్యాక్సిన్‌ అయినప్పటికీ రెండు అంశాలు చాలా ప్రధానం. అవి... వాటి సమర్థత (ఎఫికసీ), భద్రత (సేఫ్టీ). ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు దాదాపు 95% ప్రభావవంతం అని వాళ్లు అంటున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎమ్‌–ఆర్‌ఎన్‌ఏ ప్రాతిపదికన అభివృద్ధి చేశారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రోజెనెకా వ్యాక్సిన్‌ వెక్టర్‌ బేస్డ్‌ వ్యాక్సిన్‌. ఇక్కడి మన దేశంలోని వ్యాక్సిన్‌ కరోనా కిల్డ్‌/ ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ ప్రక్రియ తయారవుతుంది. ప్రస్తుత వ్యాక్సిన్లు రెండో డోసు తీసుకున్న తర్వాత... దాదాపుగా అన్నీ కూడా 95 శాతం ప్రభావపూర్వకమని ఇప్పటికి చేసిన అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వ్యాధిని నివారిస్తూ... వ్యాక్సిన్‌ మనల్ని కాపాడుతుంది కాబట్టి 16 ఏళ్లకు పైబడిన వారందరూ, వ్యాక్సిన్లపైన అపోహలు వీడి... వాటిని తప్పక తీసుకోవాల్సిందే. పదహారేళ్ల లోపు వారిపై ట్రయల్స్‌ నిర్వహించనందున ప్రస్తుతం వారికి ఇవ్వడం లేదు. అయితే ఇటీవల ఫైజర్‌ వాళ్లు 16 ఏళ్ల లోపు వాళ్లపై కూడా ట్రయల్స్‌ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు.

వ్యాక్సిన్‌ అందరికీ మామూలుగానే ఇవ్వవచ్చా? ఒకవేళ హైబీపీ, డయాబెటిస్‌ లాంటి లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌ ఉన్నవారికీ... లేదా ఇతర దీర్ఘవ్యాధులు (క్రానిక్‌ డిసీజెస్‌) ఉన్నవారికి ఏమైనా తేడాలుంటాయా?  
ప్రస్తుతం ఉన్న సిఫార్సుల ప్రకారం... ప్రజలు ఏ వయసు వారైనప్పటికీ లేదా హైబీపీ, డయాబెటిస్‌ లాంటి ఎలాంటి వ్యాధులున్న వారైనప్పటికీ వారందరికీ మొదటిసారి ఒక డోసు... ఫైజర్‌ మినహాయించి మిగతావి నాలుగు వారాల తర్వాత మరో డోసు తీసుకోవాలి. (ఫైజర్‌ ఒక్కదానికే రెండో డోసు తీసుకోడానికి మూడు వారాలు గడువు). ఇక రెండో డోస్‌ తీసుకున్న తర్వాత ఇంచుమించూ ప్రతి వ్యాక్సిన్‌ కూడా 90% వరకు రక్షణ కలుగజేస్తుందన్నది వ్యాక్సిన్‌ తయారీదారుల మాట. పదహారేళ్లు పైబడిన ఏ వయసు వారికైనా లేదా ఎలాంటి వ్యాధులు ఉన్నవారికైనా డోసు మోతాదులో కూడా మార్పులు ఉండవు. అయితే గర్భవతుల విషయంలో మాత్రమే వాళ్ల డాక్టర్‌ గర్భవతికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనాలు (ఇండివిడ్యువల్‌ రిస్క్‌ బెనిఫిట్స్‌) చర్చించి ఇవ్వవచ్చునని చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఇక ఈ మాస్కులూ, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడాలూ... ఈ పనుల నుంచి విముక్తులవుతారా? లేక వాటిని అలాగే కొనసాగించాలా?  
ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా మనం మాస్కులు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలు పాటించాల్సిందే. సమాజంలో దాదాపు 80% మంది వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తే మాస్క్‌ తొలగించే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడే కాదు. కోవిడ్‌ విషయంలో మాత్రమే కాకుండా మరెన్నో వ్యాధులను నివారించే అవకాశం ఉన్నందున... శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలు ఎప్పటికీ పాటించడం మంచిదని ఓ వైద్యుడిగా నా సలహా. మాస్క్‌ అన్నది ఇప్పటికి ఒకింత ఇబ్బందిగానే ఉన్నప్పటికీ హెర్డ్‌ ఇమ్యూనిటీ తర్వాత క్రమంగా అది తొలగిపోయే పరిస్థితి మునుముందు వస్తుందని ఆశిద్దాం.  

కరోనా వచ్చి తగ్గిన వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలా?  
ఇంతకుముందు కోవిడ్‌–19 వచ్చి తగ్గిన వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్‌తో ఏ మేరకు యాంటీబాడీస్‌ తయారయ్యాయో తెలియదు. అలాగే యాంటీబాడీస్‌ తయారీకి ఎంతకాలం తీసుకుంటుందో, వాటితో ఏమేరకు రక్షణ కలుగుతుందో తెలియదు. కాబట్టి మునుపు కరోనా వైరస్‌ సోకిన వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే.  

వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వాటిని అధిగమించడం ఎలా?  
నేను వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట కాసేపు నొప్పి తప్ప... నాకెలాంటి సమస్యా రాలేదు. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు కొద్దిగా జ్వరం, కాస్తంత నీరసం తప్ప ప్రస్తుతానికి పెద్దగా దుష్ప్రభావాలేమీ కనిపించలేదు. చాలా అరుదుగా కొంతమందిలో అలెర్జిక్‌ రియాక్షన్‌ కనిపించవచ్చు. అలాంటి వారికి అనాఫెలెక్టిక్‌ షాక్‌ వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

ఆ సమస్యను అధిగమించేందుకే వ్యాక్సిన్‌ ఇచ్చాక దాదాపు 15 నిమిషాల నుంచి అరగంట సేపు అక్కడే వేచి ఉండమంటున్నారు. ఈ అలెర్జిక్‌ రియాక్షన్, అనాఫెలెక్టిక్‌ షాక్‌ కనిపించిన వారికి మాత్రం తక్షణం తప్పక చికిత్స అందించాలి. ఇది కూడా చాలా అరుదుగా కొద్దిమందిలో కనిపించేదే కాబట్టి... సైడ్‌ఎఫెక్ట్స్‌ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.  

వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆహార పదార్థాల్లో వేటికైనా దూరంగా ఉండాలా?
అలాంటి రెస్ట్రిక్షన్స్‌ ఏమీలేవు. వారు రోజు తినేవే తినవచ్చు.

ఇప్పటికే యూకే స్ట్రెయిన్‌ అనీ, సౌత్‌ఆఫ్రికా స్ట్రెయిన్‌ అనీ వచ్చాయి కదా. ఇండియన్‌ స్ట్రెయిన్‌ అని ఏదైనా రావచ్చా?
అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.... యూకే స్ట్రెయిన్, సౌత్‌ఆఫ్రికా స్ట్రెయిన్‌ మాత్రమే కాదు... తాజాగా అమెరికన్‌ స్ట్రెయిన్‌ కూడా వచ్చింది. భారత్‌లోనే వైరస్‌లో దాదాపు 6,000 రకాల మార్పులు కనిపించాయి. అయితే ఇవేవీ అంత ప్రభావం చూపేవీ కావు. కాకపోతే మున్ముందు ఇండియన్‌ స్ట్రెయిన్‌ లేదా మరో రకం స్ట్రెయిన్‌ వచ్చే అవకాశాలను కొట్టేయలేం. వైరస్‌ అనేక మార్పులకు లోనయ్యే ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పటికి మార్పుచెందిన స్ట్రెయిన్‌పై కూడా టీకా పనిచేస్తుందని నిపుణులు, తయారీదారులు చెబుతున్నారు.  

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ప్రజలకు కరోనా పీడ విరగడ అవుతుందా?
ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే... మనం ప్రతి ఏడాదీ ఫ్లూ టీకా తీసు కుంటూ ఉంటాం. కానీ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ అనేది ప్రతిసారీ తన స్ట్రెయిన్‌ మారుస్తూ ఉంటున్నందున ప్రతి ఏడాదీ ఫ్లూ టీకా తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఇప్పటికి మనం తయారుచేసుకున్న ఈ వ్యాక్సిన్లన్నీ అత్యవసరంగా కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందడానికే.

ప్రస్తుతం రెండు డోసులు తీసుకున్న తర్వాత... మళ్లీ దీన్ని... ఫ్లూ టీకాలాగా ప్రతి ఏడాదీ తీసుకోవాలా, లేక ఒకసారి తీసుకుంటే దాని ప్రభావం ఏ రెండూ, మూడు లేదా ఐదేళ్ల పాటు ఉంటుందా... ఇలాంటి విషయాలేమీ మనకు తెలి యదు. పోనుపోనూ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటే దానికి అనుగుణంగా మనం టీకా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యవసరంగా మానవాళి ప్రాణాలు రక్షించుకోవడం కోసమే ఈ టీకా అని గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement