‘కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొవ్వు చేరుతుందని అందులోని పచ్చసొనను పక్కనపెట్టి తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. డీ విటమిన్ కొరత రాకుండా ఉండాలంటే రోజూ కోడిగుడ్డు తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనలో లభించే డీ విటమిన్ మరెక్కడా లభించదు’ అంటున్నారు డాక్టర్ ప్రత్యూషారెడ్డి. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి, అమెరికాలో క్లినికల్ న్యూట్రిషన్‌లో ఎంఎస్ చదివిన ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్‌లో పోషకాహార నిపుణులుగా రాణిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై ‘సాక్షి’కి ప్రత్యూషారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. –సాక్షి, హైదరాబాద్
రోగనిరోధక శక్తి అంటే ఏంటి?
ఎర్ర రక్తకణాలను పెంచుకోవడం లేదా వాటిని బలోపేతం చేసుకోవడమే రోగ నిరోధక శక్తి. ఏదైనా వైరస్ వస్తే, దానిపై పోరాడేతత్వం ఈ ఎర్రరక్త కణాలకు ఉంటుంది. ఏడు రకాల పద్ధతులు పాటిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
సమతుల్యమైన ఆహారం అవసరం...
ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. సమతు ల్యమైన ఆహారం అంటే ఏంటనే ప్రశ్న అందరిలో వస్తుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్ సరిగ్గా తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీలతో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో పీచుపదార్థం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రంగుల్లో లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్లు, పప్పు, చికెన్, మటన్ వంటివి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మన ఆహారంలో ఇవి మూడూ ఉండాలి. పసుపు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కరోనా సమయంలో ఏ కషాయాలు తాగాల్సిన అవసరంలేదు. రోజులో అప్పుడప్పుడు పళ్లు, డ్రైప్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.
వ్యాయామం.. నిద్ర.. నీరు
ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయ డం ఆరోగ్యానికి మంచిది. లేదా ప్రాణాయామంతో కూడిన యోగా చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రాణాయామం ముఖ్యం. వ్యాయామంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు దెబ్బతిని అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగితే మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. మానసికంగా లేదా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడి, అలసట ఏర్పడితే మనలో ఉన్న హార్మోన్లు తగ్గడం లేదా పెరగడం జరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకో వడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
పెద్దలకు ప్రతిరోజూ మల్టీ విటమిన్...
తినే ఆహారంలో అన్ని విటమిన్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి అవసరమైన విటమిన్లు శరీరానికి సరిగా అందవు. కాబట్టి పెద్దవాళ్లు రోజూ ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి. మల్టీ విటమిన్‌లో విటమిన్–సీ, యాంటి ఆక్సి డెంట్స్ ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫెక్షన్, ఊపిరితి త్తుల్లో సమస్య రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ కరోనా వచ్చినా ఇబ్బంది ఉండదు.
పండ్లను జ్యూస్ చేసుకోకూడదు..
అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసుకొని తాగకూడదు. పండ్లను నేరుగా తినడమే మేలు. జ్యూస్ చేయడం వల్ల వాటిలో షుగర్ చేరుతుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేల లోపల పండే క్యారె ట్, బీట్‌రూట్ లాంటి వాటిని ఉడికించే తినాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది సకాలంలో ఆహారం తినకపోవడం వల్లనే బరు వు పెరుగుతూ ఉంటారు. ఉదయం అల్పా హారం సరిగా తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తింటాం. ఉదయం ఏదైనా కొద్ది మోతాదులో టిఫిన్‌తోపాటు ఒక ఎగ్ లేదా కూరగాయలు తింటే సరిపోతుంది. అన్నం పరిమాణం తగ్గించుకోవాలి. సాయంత్రం తక్కువ తినాలి.
తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి లక్షణాలు..
తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి తరచుగా జలుబు చేస్తుంది. ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి చిన్నదానికీ భయపడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం, విరేచనాలు వస్తుంటాయి. తరచుగా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. శారీరకంగా పెద్దగా శ్రమ చేయకుండానే అలసిపోతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment