సాక్షి, హైదరాబాద్/ పహాడీషరీఫ్: హనీట్రాప్‌లో పడి దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్‌ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ), బాలాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన దుక్కా మల్లికార్జున్‌రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు (29) ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసి 2018లో పటాన్‌చెరులోని క్వెస్ట్ కంపెనీలో చేరాడు.
ఈ సమయంలో క్వెస్ట్ కి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీద మల్లికార్జున్‌రెడ్డి 2020 జనవరి వరకు పని చేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఫిబ్రవరిలో మల్లికార్జున్‌రెడ్డి నేరుగా డీఆర్‌డీఎల్ అధికారులను సంప్రదించి.. అడ్వాన్స్‌డ్ నావెల్ సర్వీస్ ప్రొవైడర్ (ఏఎన్‌ఎస్‌పీ) ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు.
ఫేస్‌బుక్ ప్రొఫైల్ చూసి..: ఈక్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తాను డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. 2020 మార్చిలో మల్లికార్జున్‌కు పాకిస్తా న్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం ప నిచేస్తున్న నటాషారావు అలియా స్ సిమ్రన్ చోప్రా అనే మహిళ నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావటంతో యాక్సెప్ట్ చేశాడు. అలా స్నేహం పెంచుకున్న నటాషారావు, మల్లికార్జున్ చేస్తున్న వృత్తి, పని ప్రదేశం, కంపెనీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. మల్లికార్జున్ రహస్య సమాచారాన్ని కూడా నటాషారావుకు చేరవేశాడు.
అంతేకాకుండా మల్లికార్జున్ తన బ్యాంక్ ఖాతా నంబర్, ఇతరత్రా వివరాలను నటాషాకు పంపించాడు. ఈ నేపథ్యంలో డీఆర్‌డీఎల్ రహస్యాలు లీకవుతున్నాయని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, బాలాపూర్ పోలీసులు మల్లికార్జున్‌ను మీర్‌పేట్ త్రివేణినగర్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డ్, లాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment