గ్రీవెన్స్‌లో వృద్ధ దంపతుల ఫిర్యాదు
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు.
వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్‌స్టేషన్‌లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment