పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.
ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.
పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్‌లో మాట్లాడి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment