గుండె తరుక్కుపోతోంది | Farmers fear of rain with millers Harassment | Sakshi
Sakshi News home page

గుండె తరుక్కుపోతోంది

Published Mon, May 22 2023 3:57 AM | Last Updated on Mon, May 22 2023 9:37 AM

Farmers fear of rain with millers Harassment - Sakshi

జగిత్యాలలోని ఓ కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుకు సంబంధించిన ధాన్యం కాంటా పెట్టారు. మరునాడు అందులో తాలు, గడ్డి ఉన్నాయని, తాము చెప్పినంత తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని మిల్లు యజమాని నిర్వాహకులకు ఫోన్‌ చేశాడు. ఇదే విషయం నిర్వాహకులు మల్లయ్యకు ఫోన్‌ చేసి చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాడు. 

కాంటాలు పెడతలేరు 
మాది ఖానాపురం మండలం అశోక్‌ నగర్‌ గ్రామం. పది రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చా. నాలుగు రోజులు అవుతోంది బస్తాలు నింపి. ఇప్పటివరకు కాంటాలు పెడతలేరు. కొనుగోళ్లు అయితలెవ్వు. మబ్బులు పడుతుండడంతో తడుస్తయేమోనని భయంగా ఉంది. 
– బొమ్మగాని ఉప్పలయ్య, వరంగల్‌ జిల్లా  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక కష్టాలు పడుతున్నారు. మరోవైపు తరుగు పేరిట మిల్లర్లు వారిని వేధిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల రైతుల కష్టాన్ని తరుగు పేరిట దోచుకుంటున్నా.. ఈ యాసంగిలో ఇది శ్రుతి మించింది. మిల్లర్లు ఏకంగా రైతుకే ఫోన్లు చేసి ధాన్యం వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న రైతులు వారు చెప్పినట్లు తరుగుకు తలూపుతున్నారు.

గతనెల 22న కొనుగోళ్లు ప్రారంభమైనపుడే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మొత్తం మిలాఖత్‌ అయి క్వింటాల్‌కు ఏకంగా తొమ్మిది నుంచి పది కిలోల వరకు తరుగుతో దోపిడీకి తెరతీశారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు నాలుగు కిలోల చొప్పున తరుగు తీశాక.. ఆ ధాన్యాన్ని మిల్లులో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇక్కడే మిల్లు యజమానులు చక్రం తిప్పుతున్నారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దించడం లేదు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టి ఉన్నాయని, తమకు అవసరం లేదంటూ వేధిస్తున్నారు.

ధాన్యం తీసుకెళ్లాలంటూ రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు మిల్లులకు పరుగులు పెడుతున్నారు. అలా వచ్చిన వారిని మరింత వేధి­స్తూ మరింత తరుగు తీసైనా సరే తమ ధాన్యం కొ­నాలంటూ బతిమాలేలా మిల్లర్లు చేస్తున్నారు. మరోవైపు గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు కూడా రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. 

ఆసిఫాబాద్‌లో గింజ కూడా కొనలేదు.. 
ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 32 జిల్లాల్లో 7,183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. ఇప్పటివరకు ఇందులో 6,889 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపగా.. అందులో 186 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం 32 జిల్లాల్లో దాదాపు 5.23 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

దీని విలువ దాదాపు రూ.6,934 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. నల్లగొండలో అత్యధికంగా రూ.1,100 కోట్ల ధాన్యం, నిజామాబాద్‌లో రూ.1,030 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు.. ఆసిఫాబాద్‌లో శనివారం (20వ తేదీ) సాయంత్రం వరకు రూపాయి విలువైన ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

ఓవైపు నైరుతి రుతుపవనాలు సమీపిస్తుండటం, మృగశిర కార్తెకు మరెన్నో రోజులు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొనుగోలు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తికాకపోతే.. ఇప్పటికే వడగండ్లు, అకాల వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న తాము.. ఈ జాప్యంతో మరింత దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

15 రోజులుగా పడిగాపులు 
మాది మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్లేపల్లి. 13 ఎకరాల్లో వరి సాగు చేస్తే సుమారు 260 కింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఈ నెల 7న స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. గత 15 రోజులుగా ఇక్కడికి ఒక్క లారీ కూడా రాలేదు. శనివారం కురిసిన వర్షానికి తడిసింది. మళ్ళీ కూలీలను పెట్టి ఆరబెట్టాల్సి వచ్చింది.  
– సూరినేని కమలాకర్, మంచిర్యాల  

రాత్రింబవళ్లు కుప్పల వద్దే 
వెంటవెంటనే కొనుగోళ్లు చేయకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాం. ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఇప్పటికి 20 రోజులు అవుతోంది. తూకం వేసేందుకు హమాలీలు దొరకడం లేదు. లారీలు కూడా సకాలంలో రావడం లేదు. ఈసారి అసలే ధాన్యం దిగుబడి తగ్గింది. మరోవైపు రోజురోజుకు ధాన్యం బరువు దిగిపోతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబితే కానీ లారీ డ్రైవర్లు ఇటువైపు రావడం లేదు.  
– ప్రభాకర్, రైతు, తుక్కాపూర్, మెదక్‌  

వెంటనే ధాన్యం కొనాలి 
170 బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. వర్షాలు, దొంగల భయానికి రోజూ కావలి కాస్తున్నాం. ఇంకా కాంటా పెట్టడం లేదు. వెంటనే కాంటా పెట్టి ధాన్యం కొనాలి.  
– చిన్నయ్య, నికల్పూరు, డొంకేశ్వర్, నిజామాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement