
కట్టంగూర్: కూతురు పెళ్లికి ఒకరోజు ముందు తండ్రికి కరోనా అని తేలడంతో ఆ వివాహం నిలిచిపోయింది. చికిత్స పొందుతూ ఆ తండ్రి కూతురు వివాహం చూడకుండానే గురువారం కరోనా మహమ్మారికి బలయ్యాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీఆర్‌ఏ బండారు దుర్గయ్యకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఈనెల 14న పెద్దకూతురి వివాహం కట్టంగూర్‌కు చెందిన ఓ యువకుడితో జరిపేందుకు నిర్ణయించుకున్నారు. పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే దుర్గయ్య అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 13న కట్టంగూర్ పీహెచ్‌సీలో టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దుర్గయ్య తన కూతురి వివాహాన్ని వాయిదా వేశాడు. అనుకున్న సమయానికి పెళ్లి జరగకపోవడంతో ఆయన తీవ్ర మనోవేదన చెందాడు. అదే సమయంలో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ దుర్గయ్య గురువారం మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment