నివాళి అర్పిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య సమస్యతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నర్సయ్య పార్థివదేహాన్ని బుధవారం గోదావరిఖని కాకతీయనగర్‌లోని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ చేరుకొని పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. అనంతరం మాతంగి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మాతంగి నర్సయ్య నాలుగుదశాబ్దాలుగా తనకు సుపరిచితులన్నారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సమస్యలు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్‌కుమార్, డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్, ఆర్‌ఐ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment