చిటికెలో చిట్టా  | GHMC To Make Availability To The Urban Information System | Sakshi
Sakshi News home page

చిటికెలో చిట్టా 

Published Tue, Jan 19 2021 9:24 AM | Last Updated on Tue, Jan 19 2021 9:24 AM

GHMC To Make Availability To The Urban Information System - Sakshi

అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఏ స్థానిక సంస్థ అయినా సమర్థంగా పనిచేయాలన్నా, ప్రజలకు ఉత్తమ సదుపాయాలు కల్పించాలన్నా ఎప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉండాలి. గ్రేటర్‌లో కోటిమందికి వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీ వద్ద ఇలాంటి సమాచారం లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతోంది. సమస్త సేవలన్నింటినీ వెనువెంటనే అందించేందుకు జీఐఎస్‌ ఆధారిత, ప్రాదేశిక మ్యాప్‌లతో కూడిన అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంకు  ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.  

సాక్షి, హైదరాబాద్‌: అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణకు ఉన్నత స్థాయిలో స్పెషలాఫీసర్‌ను నియమించనున్నారు. ఈ సిస్టం అందుబాటులోకి వస్తే జీఐఎస్‌ మ్యాపింగ్‌తో సహా ప్రతి ఆస్తికి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. నగర ప్రజలకు సేవలందించే వివిధ విభాగాలను సమన్వయం చేసుకొని దీన్ని రూపొందిస్తారు. టౌన్‌ప్లానింగ్, ఐటీ విభాగాలు ఇందులో ముఖ్యభూమిక వహించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే, ఏ సమాచారం కావాలన్నా చిటికెలో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక రోడ్డుకు సంబంధించిన సమాచారమే కావాలంటే.. దానిని ఎప్పుడు నిర్మించారు? దీనికోసం ఎన్ని ఆస్తులు సేకరించారు? వంటి వివరాలు సహా పూర్తి సమాచారం తెలుస్తుంది. అన్ని విభాగాలకు సంబంధించిన తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గానే పోర్టల్‌లోకి చేరతాయి. తద్వారా అత్యంత తాజా సమాచారం తెలుస్తుంది.  

వివిధ విభాగాలు.. 
⇔ ఐటీ, ఇంజినీరింగ్, ప్రాజెక్టులు, టౌన్‌ప్లానింగ్, బయోడైవర్సిటీ, రవాణా, ఫైనాన్స్, రెవెన్యూ.. అన్ని విభాగాల్లో జరిగే పనులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాయి.  
⇔ తద్వారా  నిర్ణీత సమయంలో ఎన్ని భవనాలను అనుమతులిచ్చారు.. ఎంత ఆస్తిపన్ను పెరిగింది.. వంటి వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది.  
⇔ అంతేకాదు.. మలేరియా, డెంగీ వంటి కేసులు ఏ ప్రాంతంలో ఏ నెలలో ఎన్ని ఉన్నాయి వంటివి కూడా తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకునే వీలుంది.  

జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం నుంచి జోన్లు, సర్కిళ్ల వారీగా, మొత్తం నగరానికి సంబంధించి స్లమ్‌లెన్ని.. వాటిల్లో నివసిస్తున్నవారెందరు, ట్రాఫిక్‌ ఐలాండ్లు, ఓపెన్‌స్పేస్‌లు, జీహెచ్‌ఎంసీ మార్కెట్లు, ఎస్టేట్స్‌ దుకాణాలు, శ్మశానవాటికలు, ప్లేగ్రౌండ్స్, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు,  రోజుకు వెలువడే చెత్త,  చెత్త రవాణా వాహనాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటోలు , ఫాగింగ్‌ మిషన్లు.. నగరంలో నెలవారీ జననాలు, మరణాలు.. ప్రార్థనాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు.. ఇలా సమస్త సమచారం అందుబాటులో ఉంటుంది. తద్వారా  ఏ పని చేయాలన్నా అందుకు సంబంధించిన వనరులు, సమాచారం సిద్ధంగా  ఉంటుంది. తద్వారా నిర్వహణ సామర్ధ్యం పెరుగుతుంది.  

కీలకంగా డేటాబేస్‌.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌.. 
ఆయా విభాగాల వారీగా ప్రస్తుతమున్న వనరులు, సిబ్బంది.. అది నిర్వహించే పనులు, పనిచేస్తున్నవారు, సంస్థాగత నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, వర్క్‌ఫ్లో, సమస్యల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు భవిష్యత్‌ ప్రణాళికలు, వాటిని పూర్తిచేయాల్సిన సమయం, అందుకు అవసరమైన సమాచారంతోనూ సమాంతర వ్యవస్థ పని చేస్తుందని, అన్నింటికీ డేటాబేస్‌ కీలకంగా ఉంటుందని, అది ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ తాజా పరిస్థితి అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు.  

ఐటీ పరిభాషలో.. 
ఐటీ పరిభాషలో మానిటరింగ్‌ అప్లికేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం, లేయర్‌ ఆపరేషన్స్, డేటా అప్‌డేట్, ఆటోమేటిక్‌ డాక్యుమెంట్‌ అడ్జస్ట్‌మెంట్, బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఎంక్వైరీ, ఈ–  అప్లికేషన్స్, తదితరమైనవి  ముఖ్య విభాగాలుగా ఈ సిస్టమ్‌ పని చేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement