GO Should Be Issued To Private Hospitals Within Two Weeks: TS High Court - Sakshi
Sakshi News home page

ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా?

Published Wed, Jun 9 2021 6:39 PM | Last Updated on Thu, Jun 10 2021 7:12 AM

GO Should Be Issued To Private Hospitals Within Two Weeks: TS High Court - Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, ల్యాబ్‌ పరీక్షలకు కొత్తగా ధరలను నిర్ణయించి, కేసులన్నీ తగ్గాక.. వచ్చే శతాబ్దంలో జీవో జారీ చేస్తారా?
మూడో దశ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై బ్లూప్రింట్‌ సమర్పించాలి. అన్ని వివరాలు మౌఖికంగా కాదు. రాతపూర్వకంగా సమర్పించాలి.
వాకిన్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వెంటనే ఆ మేరకు చర్యలు చేపట్టండి
-రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలకు సంబంధించిన అన్ని లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ (ప్రాణ రక్షక ఔషధాలు)ను అత్యవసర మందుల జాబితాలో చేర్చాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? అని నిలదీసింది.

ఔషధాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తాము ఆదేశిస్తే... నిబంధనలను పేర్కొంటూ నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) డిప్యూటీ డైరెక్టర్‌ అనాలోచితంగా నివేదిక ఇచ్చారంటూ మండిపడింది. లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ను వెంటనే అత్యవసర మందుల జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఈ మేరకు వచ్చే విచారణ తేదీ నాటికి ఎన్‌పీపీఏ డైరెక్టర్‌ అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, ల్యాబ్‌ పరీక్షలకు కొత్తగా ధరలను నిర్ణయించి జీవో జారీ చేయాలంటూ గత నెలలో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొత్తగా ధరలు నిర్ణయించేందుకు నాలుగు వారాల గడువు కావాలన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ విజ్ఞప్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులన్నీ తగ్గిన తర్వాత జీవో జారీ చేస్తే ప్రయోజనం ఏంటని, వచ్చే శతాబ్దంలో జీవో ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌లతో చర్చించి కొత్త ధరలను నిర్ణయించి రెండు వారాల్లోగా జీవో జారీ చేయాలని ఆదేశించింది.

కాగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ డీజీపీ సమ​ర్పించిన నివేదికపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. విచారణకు రిజ్వీతో పాటు ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావులు వీడియో కాన్ఫరె​న్స్‌ ద్వారా హాజరయ్యారు.  

ఆ టీచర్ల వివరాలు ఏవీ? 
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారు? ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి వారి చికిత్సకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో ఆదేశించినా ఎందుకు సమరరిర్పించలేదని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ వివరాలు సేకరిస్తున్నామని, తదుపరి విచారణ నాటికి సమర్పిస్తామని ఏజీ నివేదించారు.  

కమ్యూనిటీ కిచెన్‌లు ప్రారంభించలేదేం? 
స్వచ్ఛంద సంస్థల సహకారంతో కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి నిరుపేదలు, రోడ్లపై జీవనం సాగించే వారికి, వలస కూలీలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కూడా అమలు చేయలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు సహా ఇతర పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారు.. అలాగే వృద్ధులు, వికలాంగులు, అనాథలు, ఇతర నిరాశ్రయులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.. తదితర వివరాలను తెలపాలని తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

జిల్లా ఆస్పత్రుల్లో చిన్నపిల్లల వార్డులు 
మూడో దశ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో చిన్న పిల్లల వార్డులను ఏర్పాటు చేశాం. దాదాపు 4 వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
– ఉన్నతాధికారుల నివేదన 

రోజుకు 10 లక్షల మందికి టీకాలివ్వగలం..
‘రాష్ట్రంలో శిక్షణ పొందిన 10 వేల మంది నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే రోజుకు 10 లక్షల మందికి ఇవ్వ గలిగే సామర్థ్యం ఉంది. జూలై రెండో వారంలో 17 లక్షల డోసుల వ్యాక్సిన్‌  రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.73 కోట్ల మం దికి గాను ఇప్పటివరకు 41.76 లక్షల మందికి మొదటి డోసు, 13.5 లక్షల మందికి రెండో డోసు ఇచ్చాం. 2.18 కోట్ల మందికి ఇంకా వ్యాక్సిన్‌  ఇవ్వాల్సి ఉంది. వచ్చే మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్‌  ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నారంటూ 135 ఆస్పత్రులపై 223 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్ని ఫిర్యాదులను విచారించి రూ.65 లక్షలు వెనక్కి ఇప్పించాం. ఇతర ఫిర్యాదులపై కూడా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 8 ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌లను ఇటీవల ప్రారంభించగా...మరో 6 ల్యాబ్‌లను గురువారం ప్రారంభించనున్నాం. విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్‌పర్ట్‌ కమిటీని వారం రోజుల్లో ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర సరిహద్దుల్లో పెరుగుతున్న కేసులు, వైద్య బృందాలను పంపడంతో కొంత తగ్గుముఖం పట్టాయి’.  
– వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement