సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డీల కోసం కొందరు.. భూవివాదాల్లో తలదూర్చి మరికొందరు.. రాజ కీయ కారణాలతో ఇంకొందరు.. సామాన్యులపై వేధింపులకు దిగుతున్నారు. కుటుంబాలను చిదిమేస్తున్నారు. ఈ బెదిరింపులు తట్టుకోలేక, సమాజం లో అవమానానికి గురవుతున్నామన్న ఆవేదనతో బాధితులు కుటుంబాలతోసహా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇలాంటి నాలుగైదు ఘటనలు జరగడం కలకలం రేపుతోంది.
ఏ మూలన చూసినా..
►ఖమ్మంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవేందర్‌రావు వ్యవహారంలో.. నాగరామకృష్ణ అనే వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తల్లి, సోదరితో ఉన్న వివాదాలను పరిష్కరించాలంటూ రాఘవేందర్‌రావు దగ్గరికి వెళితే.. తన భార్యను కోరుకున్నాడంటూ సూసైడ్ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో.. పోలీసులు రాఘవేందర్‌రావును అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ కూడా అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
►నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉండే సురేశ్ ఈ ఏడాది జనవరి 7న విజయవాడలో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధిక వడ్డీలతో గణేశ్‌కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయిరామ మనోహర్ తమను వేధించారని, తమ ఇంటిని రాయించుకున్నారని సురేశ్ తన సూసైడ్‌నోట్, సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. నిందితులు తన భార్య, పిల్లలను నానా దుర్భాషలాడారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు.
► తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ మూడు రోజుల కింద పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగాడు. అధికార పార్టీ ఒత్తిడితో తనపై రౌడీషీట్ తెరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
► మెదక్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్, ఇతర నేతల వేధిస్తున్నారంటూ.. సంతోష్ అనే వ్యక్తి తన తల్లితో సహా కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాదిన్నర క్రితం మున్సిపల్ చైర్మన్‌పై ఆరోపణలు చేస్తూ ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్టుపెడితే.. సీఐ తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధించారని సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు.
► గతేడాది డిసెంబర్‌లో సంగారెడ్డి జిల్లా ఆర్సీ పురం పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా చంద్రకాంత్, లావణ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల వాళ్లు వేధించడంతో వారు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలింది.
దర్యాప్తులు ఎటువైపు?
కుటుంబాలతో సహా ఆత్మహత్యలు జరిగిన ఖమ్మం, నిజామాబాద్, రామాయంపేట ఘటనల్లో పోలీసుల తీరుపై ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వ్యవహారాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని.. ఇది సామాన్య ప్రజల ఇబ్బందులకు ప్రధాన కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొత్తగూడెం వనమా రాఘవేందర్‌రావు వ్యవహారంలో.. పోలీసులకు ‘పొలిటికల్ పోస్టింగ్’ వల్లే ఆరోపణలకు తావిచ్చిందని పోలీస్ శాఖలో పెద్ద చర్చే నడిచింది. ఇక నిజామాబాద్ ఘటనలో పోలీసులకు అన్ని వివరాలు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఘటనల్లో ఫిర్యాదులు వచ్చిన సందర్భంలోనే.. కనీస చర్యలు తీసుకొని ఉంటే బాధిత కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment