మెదక్ జిల్లా ధర్మారం చెరువులో చేపపిల్లలు వదులుతున్న హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి
సాక్షి, మెదక్: ప్రస్తుతం కరోనా సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా వాటిని కొనసాగిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు కింద రూ.7,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని.. రానున్న రోజుల్లో రైతే రాజు అనేది నిజం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం చెరువులో మంగళవారం ఆయన చేప పిల్లలను వదిలారు. మెదక్ కలెక్టరేట్‌లో జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైద్యశాఖాధికారులతో సమీక్షించారు. అనంతరం వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ప్రగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రైతులు మబ్బులు కాకుండా డబ్బులను చూసి సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేయడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో రైతులకు డబ్బులు జమ చేసి రైతు ప్రభుత్వం అనిపించుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
చేపలు, రొయ్యల ఎగుమతి దిశగా..
వర్షాకాలంలోనే కాకుండా ఎండా కాలంలో కూడా చెరువులు, కాల్వల్లో ఎల్లప్పుడూ నీరు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతగానో చేయూతనిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదారు చెరువుల్లో చేప పిల్లలను వదిలే వారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి చేపలు, రొయ్యలను ఎగుమతి చేసే దిశగా తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఓటీ పెట్టడం వల్ల మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యసక్తం చేశారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో మెదక్ జిల్లా రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment