సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ విధానంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సమీప భవిష్యత్తులో అధిక చార్జీలు విధించి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకు రాయితీ అందించాలనుకుంటోంది. ఈ మేరకు ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 14లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కోరింది.
పీక్ టైమ్‌లో మోత మోగనుంది...
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సంబంధించి వసూలు చేయాల్సిన చార్జీలు ఆయా కేటగిరీల సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండనున్నాయి. వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 20 శాతం, వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 10 శాతం అధిక టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించనుంది.
ఇక స్మార్ట్‌మీటర్లు తప్పనిసరి...
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించిన వెంటనే ఈ మేరకు ‘టైమ్ ఆఫ్ డే’టారిఫ్‌ను వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 10 కిలోవాట్లలోపు గరిష్ట డిమాండ్‌గల పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు... 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయం మినహా మిగిలిన కేటగిరీల వినిమోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను అమలుచేయాలని గడువు విధించింది. ఈ గడువుల్లోగా ఆయా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్‌మీటర్లను తప్పనిసరిగా బిగించాల్సి ఉంది.
ప్రస్తుత విధానంలో మార్పు ఏమిటి?
సాధారణంగా పగటివేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రాత్రివేళల్లో గణనీయంగా తగ్గిపోతుంది. డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి అధిక ధరలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు రాత్రివేళల్లో డిమాండ్ లేక విద్యుత్ మిగిలిపోతోంది. దీనికి పరిష్కారంగా రాత్రివేళల్లో డిమాండ్‌ను పెంచి పగటివేళల్లో తగ్గించడం కోసం టైమ్ ఆఫ్ డే విధానాన్ని డిస్కంలు అమలు చేస్తున్నాయి.
డిమాండ్ అధికంగా ఉండే ఉదయం 6–10 గంటలు, సాయంత్రం 6–10 గంటల మధ్య కాలంలో వినియోగించిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే టారిఫ్’పేరుతో అదనంగా రూపాయి చార్జీని విధిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉండే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే ప్రోత్సాహాకాలు’పేరుతో ఒక రూపాయి రాయితీ అందిస్తున్నాయి.
హెచ్‌టీ కేటగిరీలోని–పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, హెచ్‌టీ–2 (బీ) ఇతరత్రా వినియోగదారులు, ప్రార్థనా స్థలాలు, ఎయిర్‌పోర్టులు, బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజా ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నిర్దేశిత గడువులోగా వ్యవసాయం మినహా మిగిలిన అన్ని కేటగిరీల వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్, రాయితీ విధానం అమల్లోకి వస్తుంది.
పీక్ డిమాండ్ ఎన్ని గంటలు?
సూర్యరశ్మి ఉండే వేళల (సోలార్ హవర్స్)కు సంబంధించిన టారిఫ్.. ఆయా కేటగిరీల వినియోగదారుల సాధారణ టారిఫ్‌తో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉండాలి. రోజులో విద్యుత్ డిమాండ్ ఎన్ని గంటలపాటు గరిష్టంగా ఉంటుందనే విషయాన్ని ఈఆర్సీ/ఎస్డీఎల్సీలు ప్రకటిస్తాయి. దీని ఆధారంగా టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఖరారు చేస్తాయి. అయితే సూర్యుడు ఉండే వ్యవధికన్నా పీక్ డిమాండ్ గంటల నిడివి ఎక్కువ ఉండరాదు.
అన్ని కేటగిరీల వినియోగదారులకు సంబంధించిన టారిఫ్‌ను డిస్కంల వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ, ఇతర చార్జీల విధింపుతో టారిఫ్‌లో జరిగే మార్పులను కనీసం నెల రోజుల ముందే వెబ్‌సైట్‌లో పొందుపరచడంతోపాటు విద్యుత్ బిల్లు/ఎస్‌ఎంఎస్/మొబైల్ యాప్ ద్వారా తెలియజేయాలి.
స్మార్ట్ మీటర్లతో పెరగనున్న లోడ్
స్మార్ట్ మీటర్లను బిగించాక నమోదైన గరిష్ట లోడ్ ఆధారంగా అంతకుముందు కాలం నాటి విద్యుత్ వినియోగంపై జరిమానాలు విధించడానికి వీలు లేదు. కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ వినియోగించినట్టు రికార్డు అయితే, దాని ఆధారంగానే ఆ నెలలో బిల్లులను జారీ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ సంవత్సరంలో నమోదైన మూడు గరిష్ట లోడ్ సామర్థ్యాల్లో అతి తక్కువ లోడ్‌ను ప్రామాణికంగా తీసుకుని సాంక్షన్డ్ లోడ్‌ను సవరించాల్సి ఉంటుంది.
ఇక ‘పీక్’లో షాక్!
Published Sun, Mar 26 2023 2:56 AM | Last Updated on Sun, Mar 26 2023 2:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment