విద్యుత్‌ డిస్కంలకు షాక్‌! కరెంట్‌ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం? | Buying imported coal and gas-based electricity is burden on Discom | Sakshi
Sakshi News home page

ఎండాకాలం మొదలవుతూనే విద్యుత్‌ డిస్కంలకు మరో షాక్‌! కరెంట్‌ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం?

Published Sat, Feb 18 2023 3:21 AM | Last Updated on Sat, Feb 18 2023 4:23 PM

Buying imported coal and gas-based electricity is burden on Discom - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎండాకాలం మొదలవుతూనే విద్యుత్‌ డిస్కంలకు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న డిమాండ్‌ ఓవైపు, అవసరానికి తగినంత సరఫరా చేయలేక మరోవైపు కిందామీదా పడుతున్న డిస్కంలపై విద్యుత్‌ కొనుగోళ్ల భారం మీద పడుతోంది. ‘దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల’ విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో అమ్ముకోడానికి ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్‌)కు కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. ఈ అంశంలో ఐఈఎక్స్‌ వేసిన పిటిషన్‌పై సీఈఆర్సీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీని ప్రభావంతో ఈ వేసవిలో విద్యుత్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఎక్కువగా విద్యుత్‌ కొనుగోలు చేసే రాష్ట్రాలపై భారం పడుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పరిమితితో నష్టాల పేరిట.. 
గతేడాది వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. సరిపడా అందుబాటులో లేక తీవ్ర కొరత ఏర్పడింది. ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.20కు మించిపోయాయి. అత్యధిక ధరతో కొనుగోళ్లతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీఈఆర్సీ.. విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.12 మించరాదని పరిమితి విధిస్తూ 2022 మే 6న సుమోటోగా ఆదేశాలు జారీ చేసింది.

అయితే దిగుమతి చేసుకున్న బొగ్గు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల విద్యుత్‌ ధరలు సాధారణంగానే ఇంతకన్నా అధికంగా ఉంటాయి. పరిమితి కారణంగా అవి ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్‌ విక్రయించలేక నష్టపోతున్నట్టు కేంద్రం గుర్తించింది. అలాంటి ప్లాంట్లు ఎనర్జీ ఎక్స్చేంజీల్లో అధిక ధరతో విద్యుత్‌ విక్రయించుకోవడానికి వీలుగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గతేడాది అక్టోబర్‌ 11న ‘హై ప్రైస్‌ డే అహెడ్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 

‘ఎన్రాన్‌’ విద్యుత్‌ ధర ఆధారంగా.. 
కొత్త విధానానికి అనుగుణంగా.. దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించేందుకు అనుమతి కోరుతూ ఇండియన్‌ ఎనర్జీ ఎక్ఛ్సేంజీ గతేడాది చివరిలో సీఈఆర్సీలో పిటిషన్‌ వేసింది. తర్వాత ఈ ధరను రూ.99 వరకు పెంచాలని అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

మహారాష్ట్రలోని రత్నగిరి గ్యాస్‌ అండ్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (పూర్వపు ఎన్రాన్‌ సంస్థ)కు చెందిన విద్యుత్‌ను ఇటీవల యూనిట్‌కు రూ.58.98 భారీ ధరతో విక్రయించినట్టు వివరించింది. ఆ ప్లాంట్‌ విద్యుత్‌ వేరియబుల్‌ కాస్ట్‌(గ్యాస్‌/ఇంధన వ్యయం) యూనిట్‌ రూ.58.48గా ఉందని.. దానికి అనుగుణంగా అధిక ధరను నిర్ణయించాలని కోరింది. దీనిపై సీఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్డీసీ) అధిక ధరను సమర్థించింది.

సీఈఆర్సీ దీనిని పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 100 శాతం దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మాత్రమే ‘హైప్రైస్‌ డే అహెడ్‌ మార్కెట్‌’ సెగ్మెంట్‌ కింద, అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.50 ధరతో విక్రయించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై కొంతకాలం పరిశీలన జరిపిన తర్వాత పునః సమీక్షిస్తామని తెలిపింది. అయితే రెండు దశాబ్దాల కింద ఎన్రాన్‌ విద్యుత్‌ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్లాంటు విద్యుత్‌ ధరను పరిగణనలోకి తీసుకుని గరిష్ట ధరను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

మూడో ఆప్షన్‌గానే.. అధిక ధర విద్యుత్‌! 
ఎనర్జీ ఎక్స్చేంజీలో ఈ అధిక ధర (హైప్రైస్‌ సెగ్మెంట్‌) విద్యుత్‌ విక్రయాన్ని మూడో ఆప్షన్‌గా చేర్చారు. ‘డే అహెడ్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌’ విధానం కింద ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో తొలుత సౌర, పవన విద్యుత్‌ వంటి గ్రీన్‌ విద్యుత్‌ను అమ్మకానికి పెడతారు. వాటి విక్రయాలు పూర్తయ్యాక థర్మల్‌ విద్యుత్‌ను విక్రయిస్తారు.

ఈ రెండు సందర్భాల్లో బిడ్డింగ్‌లో పాల్గొని విద్యుత్‌ను పొందలేకపోయిన డిస్కంలు.. ‘హైప్రైస్‌’ విద్యుత్‌ కోసం బిడ్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీనిలో కనీస ధర సున్నా నుంచి గరిష్ట ధర రూ.50కి మధ్య కోట్‌ చేయవచ్చు. ఎక్కువ ధరను కోట్‌ చేసిన డిస్కంలకు విద్యుత్‌ను విక్రయిస్తారు. 
 
ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో కొనుగోళ్లు ఎందుకు? 
రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సాధారణంగా దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ప్లాంట్ల నుంచి నేరుగా విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తుంటాయి. వీటి విద్యుత్‌ ధర ఒప్పందాలను బట్టి యూనిట్‌కు రూ.4.5 నుంచి రూ.6 వరకు ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలు కాకుండా వివిధ ప్లాంట్లు, విద్యుత్‌ సంస్థల నుంచి బహిరంగ మార్కెట్లో ‘ఎనర్జీ ఎక్స్చేంజీ’ల ద్వారా విద్యుత్‌ విక్రయాలు కూడా జరుగుతుంటాయి.

డిస్కంలు విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ‘డే ఎహెడ్‌ మార్కెట్‌ (డీఏఎం)’ సెగ్మెంట్‌ కింద ఎనర్జీ ఎక్స్చేంజీల ద్వారా అవసరమైన మేర కరెంటు కొని వినియోగదారులకు సరఫరా చేస్తుంటాయి. ఈ కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్‌లో బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ధర కోట్‌ చేసిన డిస్కంలకు విద్యుత్‌ లభిస్తుంది. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రాల డిస్కంలు పోటాపోటీగా బిడ్డింగ్‌లో పాల్గొంటుండటంతో విద్యుత్‌ ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. 

‘కొనే’ రాష్ట్రాలకు భారమే
గత ఏడాది వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిఎక్ఛ్సేంజీల్లో విద్యుత్‌ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినా యాసంగి కోసం రైతులకు, ఇతర వినియోగదారులకు సరఫరా సాగించడానికి తెలంగాణ డిస్కంలు రోజుకు రూ.100 కోట్ల నుంచి రూ.165 కోట్లు ఖర్చుచేసి ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేశాయి. పలు ఇతర రాష్ట్రాలూ అత్యధిక ధరతో విద్యుత్‌ కొన్నాయి.

ఇప్పుడు ‘దిగుమతి’ ప్లాంట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకునే అవకాశం రావడంతో.. ప్రస్తుత వేసవి లో విద్యుత్‌ కొనుగోళ్ల భారం పెరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 17,600 మెగావాట్ల మేర ‘దిగుమతి’ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయని.. వాటి విద్యుత్‌ ధరలు అమాంతం పెరిగిపోనున్నా యని చెప్తున్నారు. విద్యుత్‌ను ఎక్కువగా కొనే రాష్ట్రాలపై భారం పడుతుందని వివరిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement