నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'! | Huge Irregularities In Dalit Bandhu Scheme Telangana | Sakshi
Sakshi News home page

నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'!

Published Mon, May 15 2023 4:14 AM | Last Updated on Mon, May 15 2023 2:34 PM

Huge Irregularities In Dalit Bandhu Scheme Telangana - Sakshi

చారగొండ మండలం తిమ్మాయిపల్లికి చెందిన రాములు దళితబంధుతో పెద్ద కిరాణాషాపు పెట్టుకో వాలనుకున్నాడు. కానీ తనకు మంజూరైన మొత్తంలో అధికభాగం కమీషన్లకే పోవడంతో మిగతా డబ్బుతో చిన్న దుకాణానికే పరిమితమయ్యాడు.

తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఇటికాల లచ్చయ్యకు రూ.8.40 లక్షలతో 8 గేదెలు ఇచ్చినట్టు చూపి.. నాలుగు మాత్రమే ఇచ్చారు. మిగతా గేదెల కోసం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  

..రాష్ట్రంలో దళిత బంధు పథకంలో జరుగుతున్న అక్రమాలకు చిన్న ఉదాహరణలివి. 2021 ఆగస్టులో మొదలైన ఈ పథకంలో కొందరు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కక్కుర్తితో భారీగా జరిగిన అవినీతి వెలుగుచూస్తోంది. కొన్నిచోట్ల సామగ్రి ఇప్పిస్తామంటూ, జీఎస్టీ అంటూ కొన్నిచోట్ల దోచేస్తే.. మరికొన్నిచోట్ల నేరుగానే అక్రమాలకు పాల్పడటం, కొందరు లబ్ధిదారుల విషయంలో అయితే పథకం సొమ్ములో ఏకంగా సగం దాకా కాజేయడం విస్మయం కలిగిస్తోంది. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. రాష్ట్రంలో దళితుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న పథకం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపడం దీని లక్ష్యం. దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం.. హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికతో విస్తరించింది.

రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం పైలట్‌ ప్రాజెక్టుగా తిరుమలగిరి (తుంగతుర్తి నియోజకవర్గం), చారకొండ (అచ్చంపేట), చింతకాని (మధిర), నిజాంసాగర్‌ (జుక్కల్‌) మండలాల్లో దళితులందరికీ.. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి చొప్పున తొలి విడతగా దళిత బంధును అమలు చేశారు. అయితే వాసాలమర్రి, హుజూరాబాద్‌ వరకుబాగానే సాగిన పథకం.. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి మండలాల్లో అడ్డదారులు తొక్కింది. 

విచ్చలవిడిగా అక్రమాలు.. 
దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,223 కుటుంబాల కోసం రూ.230 కోట్లు వ్యయం చేశారు. కానీ ఇక్కడ నాయకులే అన్నీ తామై వ్యవహరించి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఒక్క తొండ (తిరుమలగిరి) గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ డెయిరీని ఉపాధిగా ఎంచుకున్న వారికి ఇప్పటికీ గేదెలు ఇవ్వలేదు. మొత్తం రూ.10 లక్షల సొమ్ములో.. రూ.1.50 లక్షలను గేదెల షెడ్డుకు వినియోగించినట్టు చూపారు.

నిజానికి షెడ్డు వేసింది అధికార పార్టీ నాయకుడి అనుచరుడే. కేవలం రూ.50 వేలలో దాన్ని పూర్తిచేసి లక్షన్నర బిల్లు చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. మిగతా సొమ్ములో కనీసం ఏడు నుంచి తొమ్మిది గేదెలు ఇవ్వాల్సి ఉండగా.. లబ్ధిదారులను పశ్చిమగోదావరి జిల్లా తణుకు తీసుకువెళ్లి ఓ కాంట్రాక్టర్‌కు చెందిన షెడ్డులో గేదెలతో ఫొటోలు తీయించారు. వాటిని అప్‌లోడ్‌ చేసి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. కానీ రైతులకు ఇచ్చినది ఒకట్రెండు గేదెలు మాత్రమే.

మిగతా గేదెల కోసం నాయకులు, అధికారులను అడిగితే.. ఇంకెక్కడి గేదెలు అంటూ ఎదురుప్రశ్నలే వచ్చాయి. ఒకరిద్దరు కాదు చాలా మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి. తణుకు నుంచి 13 డీసీఎం వాహనాల నిండా గేదెలను రవాణా చేయాల్సి ఉండగా.. మూడే వాహనాల మేర మాత్రమే తెచ్చారు. కానీ నంబరు ప్లేట్లు మార్చి పదమూడు వాహనాలుగా చూపెట్టి దళితబంధు నిధులను పక్కదారి పట్టించారు. 
 
జీఎస్టీ పేరుతోనూ ముంచేశారు 
పలుచోట్ల అంతగా ప్రాచుర్యం కానీ నాసిరకం బ్రాండ్ల వాహనాలు, పనిముట్లు కొనుగోలు చేశారు. అదీగాక కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై జీఎస్టీ పేరుతోనూ అక్రమాలకు తెరలేపారు. లబ్ధిదారులు పెట్టుకునే యూనిట్లకు సరుకులు, వస్తువులు తామే సరఫరా చేస్తామని చెప్పారు. కిరాణ, క్లాత్‌ స్టోర్, ఫుట్‌వేర్, స్టీల్‌ సామగ్రి, హార్డ్‌వేర్‌ పరికరాలను పంపిస్తామని చెప్పి.. ఆనక వస్తువులు ఇవ్వకుండా రూ.6 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకే సొమ్ము ఇచ్చినట్లు లబ్ధిదారులు చెప్తున్నారు. మిగతా సొమ్ములో కొంత జీఎస్టీ కింద కట్‌ అయిందని, మరికొంత కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముడుపులుగా ఇవ్వాల్సి ఉందని చెప్పారని వాపోయారు. 
 
కాంట్రాక్టర్‌ ఫోన్‌ ఎత్తడం లేదు 
నా భార్య పల్లెర్ల జానమ్మ పేరు మీద డెయిరీ యూనిట్‌ మంజూరైంది. కాంట్రాక్టర్‌ మొదట నాలుగు గేదెలు ఇచ్చాడు. మిగతా గేదెలు ఇవ్వకుండా.. మమ్మల్ని తణుకు తీసుకెళ్లి ఫొటోలు తీసుకొని పంపించాడు. మిగతా నాలుగు గేదెలకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్‌ వర్మకు ఫోన్‌ చేస్తే ఎత్తడం లేదు. మా గేదెలు మాకు ఇవ్వాలి. 
– పల్లెర్ల గోపాల్, తొండ గ్రామం, సూర్యాపేట జిల్లా 
 
ఇలా చేస్తే.. పక్కా నిర్వహణ! 

దళితబంధు మెరుగైన నిర్వహణ కోసం దళితుల అభివృద్ధి, సంక్షేమంపై పనిచేస్తున్న ఓ ఎన్జీఓ పలు సిఫారసులు చేసింది. 
► లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నిర్ణయం కాకుండా గ్రామం, మండలం యూనిట్‌గా జీవనోపాధి (లైవ్లీవుడ్‌) ప్రాజెక్టు రూపొందించినట్టుగా చేపట్టాలి. 
► లబ్ధిదారుల ఇష్టం ప్రకారం కాకుండా అక్కడి అవసరాలు, మున్ముందు కొనసాగే అవకాశమున్న యూనిట్లను ఎంచుకునే దిశగా కృషి చేయాలి. 
► సాంకేతిక నైపుణ్యమున్న వారికి అవే యూనిట్లు, లేని వారికి అక్కడ అవసరమైన యూనిట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలి. 
► యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యాక వారికి చేతి నిండా పనికల్పించే కార్యాచరణను రూపొందించాలి. దీని అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఐదేళ్లపాటు కృషి చేయాలి. 
 
బహిరంగంగానే అవినీతి 
దళితబంధు పథకం రూపకల్పనే బాగా లేదు. సరైన విధివిధానాలు లేకే ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఆడింది ఆట, పాడింది పాటలా మారింది. అందుకే చాలాచోట్ల లబ్ధిదారుల ఎంపికలో అవినీతి చోటుచేసుకుంది. పైలట్‌ మండలాలు సహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో భారీగా ముడుపులు చేతులు మారాయి. అవినీతి అక్రమాలు, బహిరంగంగానే జరిగాయి. నిరుపేద దళితుల ఇళ్లలో సంపద సృష్టించాల్సిన పథకం చాలాచోట్ల దారి తప్పింది. 
– ఆకునూరి మురళి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement