
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్‌లలో 65 శాతం ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌లే ఉన్నాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ ఐఐటీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మానవ వనరుల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
ఇండియాలో డిజిటల్ ఎకానమీ 34 శాతం ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా, ప్రాన్స్ వంటి దేశాల్లో 8 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఫార్మా తదితర రంగాలను ప్రపంచ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఎగుమతి చేసి, బదులుగా ఆయా దేశాల నుంచి విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయరంగం అభివృద్ధితో పాటు నూతన ఆవిష్కరణలు దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు. ఇంగ్లిష్ పెద్దగా తెలియని చైనా నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు.
వైరస్‌ల పట్ల అలసత్వం వద్దు
వైరస్‌ల కారణంగా పుట్టుకొస్తున్న వ్యాధుల పట్ల అలసత్వం వద్దని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాధుల మూలాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎక్కడికక్కడ సరైన వైద్యం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మడగాస్కర్‌లో పుట్టిన చికున్‌గున్యా ఇండియాకు విస్తరించిందనీ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన జికా వైరస్ బ్రెజిల్ వంటి దేశాలకు విస్తరించిందని తెలిపారు. ఐఐటీహెచ్‌లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ పాలకవర్గం చైర్మన్ బీవీజీ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment