తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..ఘనకీర్తిని చాటుదాం | Hyderabad: Cm Kcr Review Meeting Collectors And Sps | Sakshi
Sakshi News home page

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..ఘనకీర్తిని చాటుదాం

Published Fri, May 26 2023 2:22 AM | Last Updated on Fri, May 26 2023 1:15 PM

Hyderabad: Cm Kcr Review Meeting Collectors And Sps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పోరాటాలు, త్యాగాలతో ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న స్వరాష్ట్రం పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జూన్‌ 2 నుంచి 3 వారాల పాటు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా  సంబురాలు జరపాలన్నారు.

ఉత్సవాల నిర్వహణకు రూ.105 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలతో పాటు ఇతర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఎం సమావేశం నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు. శాఖలు సాధించిన అభివృద్ధి, అందుకు రాష్ట్ర  ప్రభుత్వం అనుసరించిన ప్రజా సంక్షేమ కోణాన్ని, తాతి్వక ధోరణిని, దాని వెనకున్న దార్శనికతను వివరించారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, రోడ్లు, భవనాలు తదితర శాఖల ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు.  

మూడు విడతల్లో గృహలక్ష్మి సాయం
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 వేల మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విష యం తెలిసిందే. కాగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆయా దశలను ఫోటోలు, ఇతర మార్గాల ద్వా రా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబి్ధదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్‌ సూచించారు. లబ్ధిదారులకు మొదటి దశ (బేస్‌మెంట్‌)లో రూ.లక్ష, స్లాబ్‌ దశలో మరో రూ.లక్ష, చివరి దశలో మిగిలిన రూ.లక్ష అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి జిల్లాల కలెక్టర్లకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.   

అన్ని రాష్ట్రాలను దాటేసి ముందంజ..         
 ‘తెలంగాణ.. వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్యుత్‌ సహా అన్ని రంగాల్లోనూ దేశంలోనే ముందంజలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌ హర్యానాలను దాటేసి దూసుకుపోతోంది. ఎరువుల వినియోగం 8 లక్షల టన్నుల నుంచి 28 లక్షల టన్నులకు పెరిగింది. గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్థితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను దాటేసి పోతున్నాం. విద్యా, వైద్య రంగాల్లోనూ తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర విద్యార్థులు నీట్, సివిల్స్‌ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతున్నారు..’ అని సీఎం తెలిపారు. (నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించినందుకు ఈ సందర్భంగా సమావేశం అభినందనలు తెలిపింది) 

రైతుల్ని చైతన్యపరచాలి.. 
‘వ్యవసాయంలో రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్‌ టన్నులు దాటింది. ప్రాజెక్టులతో పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, గ్రౌండ్‌ వాటర్‌ ఉంది. మొగులు మొకం చూడకుండా కాల్వల నీళ్లతో వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి తుంగతుర్తి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా ఉంది. అయితే యాసంగి నాట్లు ఆలస్యం కావడంతో వేసవిలో అకాల వర్షాలు, వడగండ్లతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్‌ 15, 20లోగా యాసంగి వరినాట్లు వేసుకోవాలి. యాసంగి నాట్లు ముందుగా పడాలంటే వానాకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాలి. రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలి. మే 25 నుంచి జూన్‌ 25 జూన్‌ మధ్య వరినాట్లు పూర్తి కావాలి. యాసంగి వరినారు నవంబర్‌లో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో ఉంది. అది వాస్తవం కా>దు. వరి తూకం పోసేటప్పుడు కాదు, వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. ఈనేటప్పడు చలి వుంటే తాలు ఎక్కువవుతుంది. ఎండలు ముదరకముందే వరి కోసుకుంటే గింజ గట్టిగ ఉండి తూకం కూడా బాగుంటుంది. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే తాలు తక్కువ, తూకం ఎక్కువ అవుతుంది. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరచాలి..’ అని కేసీఆర్‌ ఆదేశించారు.   

ఉత్సవాల వీడియో రికార్డింగ్‌.. 
    ‘దశాబ్ది ఉత్సవాలను జిల్లాల వారీగా కలెక్టర్లు వీడియో రికార్డు చేసి భద్రపరచాలి. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే పదేళ్ల ప్రగతి నివేదిక, పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలి. ఆయా రంగాల అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వీటిని ప్రదర్శించాలి. ఆయా జిల్లాల అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రులు ఈ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించేలా సిద్ధం కావాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు.  

4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు.. 
    ‘జూన్‌ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనులు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పోడు పట్టాలను పంపిణీ చేయాలి. 2,845 గ్రామాలు, తండాలు, గూడాల పరిధిలో 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయనున్నాం. మొత్తం 1,50,224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుంది. పోడు భూముల లబ్ధిదారుల పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించాలి. ఈ ఖాతాల ద్వారా వారికి ప్రభుత్వం రైతుబంధును అందజేస్తుంది. 3.08 లక్షల మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపజేస్తాం..’ అని ప్రకటించారు.  

గొర్రెల పంపిణీని కూడా ప్రారంభించాలి.. 
    ‘బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కులవృత్తులతో జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు, ఇతర బీసీ, ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రూ.లక్ష ఉచిత ఆర్థిక సాయాన్ని అందించనున్నాం. జూన్‌ 9న జరుపుకొనే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో.. సబ్‌ కమిటీ సిఫారసు చేసిన, ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందుకోని బీసీ, ఎంబీసీ కులాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,100 మంది లబి్ధదారులను ఎంపిక చేసి దళితబంధు పథకాన్ని అమలు చేయాలి. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశల వారీగా అమలు చేయాలి..’ అని ఆదేశించారు.   

 సఫాయీ కార్మికులు భగవంతుడంతటివారు.. 
    ‘గ్రామ, పట్టణ స్థాయిల్లో పారిశుధ్య కారి్మకుల సేవలు వెలకట్టలేనివి. దశాబ్ది వేడుకల సందర్భంగా ‘సఫాయన్నా.. నీకు సలామన్నా’ అనే నినాదంతో ఉత్తమ మహిళా, పురుష కార్మికులకు అవార్డులు అందించి గొప్పగా గౌరవించుకుంటాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ తోటి మానవుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుధ్య కార్మికులు భగవంతుడంతటివారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీతాలు పెంచుతున్నది వారి మీద గౌరవంతోనే..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement