సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ ప్రాజెక్టులు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ పనులన్నింటినీ ఇకపై ఒకే గొడుగుకింద పర్యవేక్షించనున్నారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా తగుచర్యలు చేపట్టింది. నగరంలో ప్రధానంగా రోడ్ల నిర్మాణం.. నిర్వహణ పనులు జీహెచ్‌ఎంసీ మెయింటనెన్స్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుండగా, ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద జరుగుతున్న ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ తదితర పనుల్ని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం పర్యవేక్షిస్తోంది.
ప్రధాన రహదారుల మార్గాల్లో చిక్కులు తప్పించేందుకు బాటిల్‌నెక్స్ సమస్య పరిష్కారానికి ఆయా ప్రాంతాల్లో లింక్, స్లిప్‌రోడ్లు నిర్మిస్తున్నారు. వీటికోసం ప్రత్యేకంగా హెచ్‌ఆర్‌డీసీ(హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ని ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.
తరచూ సంభవిస్తున్న వరద సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునీకరణ తదితర పనులకు ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)పేరిట ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. పాతబస్తీకి సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల్ని కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించారు. ఈ ప్రత్యేక సంస్థలు చీఫ్‌ఇంజనీర్ల (సీఈల)నేతృత్వంలో పనిచేస్తున్నాయి.
పనులన్నీ జరుగుతున్నది గ్రేటర్ నగరంలోనే అయినప్పటికీ, వివిధ విభాగాల పర్యవేక్షణలో ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఆయా పనుల్లో సమన్వయం కుదరడం లేదు. వేటికవే పనిచేస్తుండటంతో ఒక విభాగం చేస్తున్న పని మరో విభాగానికి తెలియడం లేదు. ఈ విభాగాలన్నీ పనిచేస్తున్నది నగర ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపరచడం, వరద ముంపు సమస్యలు తగ్గించడం వంటి పనులకే కావడంతో అన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు ఒకరికే ఉంటే పనుల నిర్వహణ, పర్యవేక్షణ, సమన్వయం వంటి వాటిల్లో ఆటంకాల్లేకుండా ఉంటుందని, ఆయా పనులు త్వరితంగా పూర్తికాగలవని భావించిన ప్రభుత్వం అన్నింటి పర్యవేక్షణ, కంట్రోల్ బాధ్యతల ఇన్‌ఛార్జిగా ఒకరే ఉండాలని నిర్ణయించింది.
అందుకనుగుణంగా ప్రస్తుతం హెచ్‌ఆర్‌డీసీ చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌జియాఉద్దీన్‌ను జీహెచ్‌ఎంసీ మెయింటనెన్స్ విభాగం సీఈగా బదిలీ చేయడంతో పాటు ఆ పోస్టును ఇంజనీర్ ఇన్‌చీఫ్(ఈఎన్‌సీ)గా రీ డిజిగ్నేట్ చేసింది. దాంతో పాటు మెయింటనెన్స్ విభాగం పర్యవేక్షణలో ఉన్న ప్రైవేటు ఏజెన్సీలకు రోడ్ల నిర్మాణం, బాధ్యతలకు సంబంధించిన సీఆర్‌ఎంపీ(సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం)తో సహ ఎస్‌ఎన్‌డీపీ, హెచ్‌ఆర్‌డీసీల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ఇన్‌ఛార్జిగా పర్యవేక్షణ బాధ్యతలప్పగించింది. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీతో సహ వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ఓవరాల్ కంట్రోల్, పర్యవేక్షణ బాధ్యతలప్పగించింది. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ ఎస్టాబ్లి‹Ùమెంట్‌కు సంబంధించిన అధికారాలు సైతం ఆయనకే ఉన్నాయి.
చీఫ్ ఇంజనీర్ల బదిలీలు
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం సీఈగా ఉన్న పి.సరోజారాణిని హెచ్‌ఆర్‌డీసీ సీఈగా బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ మెయింటనెన్స్ విభాగం సీఈగా పనిచేస్తున్న ఎం.దేవానంద్‌ను ప్రాజెక్ట్స్ విభాగం సీఈగా బదిలీ చేశారు. ఈమేరకు మునిసిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment