బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతోంది. ఈ నెల 26న శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్న రాష్ట్రపతి వారం రోజుల పాటు ఇక్కడ బస చేస్తారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆర్మీ, పోలీసు, రెవెన్యూ, కంటోన్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సహా తదితర విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దక్షిణాది విడిది...
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్‌లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలున్నాయి. శీతాకాలంలో కనీసం వారం రోజుల పాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులూ ఇక్కడ బస చేశారు. కోవిడ్ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్‌లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామానంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.
1860లో రెసిడెన్సీ హౌస్ పేరిట నిర్మాణం..
►1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో రెసిడెన్సీ హౌస్ పేరిట బొల్లారంలో భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. 1948లో ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. అనంతరం రెసిడెన్సీ హౌస్ రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా కొనసాగుతోంది.
►90 ఎకరాల విస్తీర్ణంలో 16 గదులతో కూడిన భవనంతో పాటు పక్కనే సందర్శకులు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. 150 మంది విడిది చేసేందుకు అనువైన ఈ భవనంలో దర్బార్, డైనింగ్, సినిమా హాళ్లు, ప్రధాన భవనానికి సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేసిన కిచెన్ హాల్ ఉన్నాయి.
పూలు, పండ్ల తోటలు
►బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వివిధ రకాల పూల మొక్కలతో పాటు మామిడి, దానిమ్మ, సపోటా, ఉసిరి, కొబ్బరి తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, మంచినీటి బావులతో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంటుంది. 116 రకాల ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలతో కూడిన గార్డెన్ ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చొరవతో ఏర్పాటు చేసిన నక్షత్రశాలను 2015లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. 27 నక్షత్రాలను ప్రతిబింబించేలా 27 రకాల విభిన్నమైన మొక్కలతో దీన్ని రూపొందించారు.
చిట్టడవిని తలపించేలా..
►నగరం నడిబొడ్డును చుట్టూ మిలిటరీ స్థావరాలు, బలగాల పహారాలో ఉండే రాష్ట్రపతి నిలయం ఓ చిట్టడవిని తలపిస్తుంది. పూలు, పండ్ల తోటల్లో పక్షుల కిలకిలారావాలతో పాటు మయూరాలు కూడా కనువిందు చేస్తాయి. వేకువజామున రాష్ట్రపతి వాకింగ్ చేసేందుకు అనువుగా వాకింగ్ ట్రాక్‌ను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో కోతులతో పాటు పాముల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతియేటా రాష్ట్రపతి పర్యటనకు కొన్ని రోజుల ముందు నుంచే నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది ఇక్కడికి చేరుకుని వాటిని నియంత్రించే పనిలో నిమగ్నమవుతారు. రాష్ట్రపతి పర్యటన ముగిశాక జనవరిలో సామాన్యుల సందర్శనకు అవకాశం కల్పిస్తారు.
రాష్ట్రపతి రాక నేపథ్యంలో రిహార్సల్స్
హిమాయత్‌నగర్: ఈ నెల 27న నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కాలేజీలో రిహార్సల్స్ చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి నారాయణగూడకు చేరుకున్న ప్రత్యేక బృందాలు పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నారు. కాలేజీలోని ప్రతీ అణువును జాగిలాలతో తనిఖీలు చేయించారు. కాలేజీ ఆడిటోరియంలో జరిగే సదస్సులో రాష్ట్రపతి హాజరు కానున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి.
Comments
Please login to add a commentAdd a comment