రసూల్‌పురా (హైదరాబాద్): హైదరాబాద్ విమోచన దినోత్సవం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు.
హైదరాబాద్ ప్రాంత చరిత్ర, రజాకార్ల దౌర్జన్యాలు, హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో విలీనం చేసిన పరిస్థితులు.. వంటి చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకోవాలని గవర్నర్ సూచించారు. గత మూడు రోజులుగా రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ రాగ్ (గానం), ఆజాదీ కా యాక్ట్స్ (స్కిట్, డ్రామా) క్విజ్‌లో (ప్రహేలికా) భారత సారస్వతం, ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఓపెన్ మైక్ సెషన్, ప్యానల్ చర్చలు, ఇతర అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు మెమెంటో, ప్రశంసాపత్రాలు, కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గుప్త, డిప్యూటీ సెక్రటరీ స్వాతి షాహి, కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీజే రావు, పరిపాలనాధికారి రజనిప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment