
సాక్షి,హైదరాబాద్: దసరా, దీపావళి, సంక్రాంతి వరుస పండగల సందర్భంగా మెట్రోరైలు సంస్థ మళ్లీ 3 సువర్ణ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ నెల 18 నుంచి అమలుకానున్న ఈ పథకంలో ప్రయాణికులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం కల్పించినట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్–జేబీఎస్ (గ్రీన్‌లైన్) మార్గంలో కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం కల్పించడం విశేషం.
ఆఫర్‌లివే..
ట్రిప్‌పాస్ ఆఫర్: ఈ ఆఫర్‌లో ప్రయాణికులు ఎవరైనా 20 ట్రిప్పులకు చెల్లించి.. 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం ఉంది. 45 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెట్రో స్మార్ట్‌కార్డు (పాత, కొత్త కార్డులున్నవారు)ప్రయాణికులకు ఈ ఆఫర్‌కు అర్హులు. అక్టోబరు 18 నుంచి జనవరి 15, 2022 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది.
గ్రీన్‌లైన్ ఆఫర్: ఎంజీబీఎస్– జేబీఎస్–మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే వారు కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌కార్డులు, టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే వారికి సైతం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 15, 2022 వరకు అమల్లో ఉంటుంది.
నెలవారీగా లక్కీ డ్రా: మెట్రో ప్రయాణికులకు నెలవారీగా లక్కీడ్రా తీయనున్నారు. అక్టోబరు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ప్రతి నెలా డ్రా తీస్తారు. నెలలో 20 ట్రిప్పులు స్మార్ట్‌కార్డుల ద్వారా జర్నీ చేసినవారిని కార్డు నంబరు ఆధారంగా ఈ డ్రా తీస్తారు. అయిదుగురు విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.
ఇందుకోసం ప్రతి ప్రయాణికుడూ తమ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డును టి–సవారీ యాప్ లేదా మెట్రో స్టేషన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు మెట్రో స్టేషన్లలో సిబ్బందిని సంప్రదించాలని ఎండీ సూచించారు.