నష్టాల నుంచి గట్టెక్కించండి ప్లీజ్‌ | Hyderabad Metro Officials Request to Governmet on Start Services | Sakshi
Sakshi News home page

రూ.3,756 కోట్లు  ప్లీజ్‌

Published Sat, Aug 15 2020 8:12 AM | Last Updated on Sat, Aug 15 2020 8:12 AM

Hyderabad Metro Officials Request to Governmet on Start Services - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో నష్టాల బాట పట్టింది. వీటినుంచి గట్టెక్కేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రోకు తక్షణం రూ.3,756 కోట్లు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి రాసిన తాజా లేఖలో కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువు పెరగడం, అవసరమైన భూములు, స్థలాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రభుత్వపరంగా ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అందులో పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తిచేసేందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిర్మాణ సంస్థ సేకరించిన సుమారు రూ.15 వేల కోట్లకుపైగా రుణాలు, వాటి వాయిదాలు, వడ్డీల చెల్లింపులు పెరిగిపోవడంతో సంస్థ భారీగా నష్టాలుచవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 22 నుంచి  వరుసగా ఐదు నెలలపాటు సర్వీసులు నిలిచిపోవడంతో నెలకు దాదాపు రూ.50 కోట్ల చొప్పున మార్చి నుంచి ఆగస్టు మధ్యకాలంలో సుమారు రూ.250 కోట్ల మేర నష్టాలు వచ్చాయని  లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో రైలు సర్వీసులు నడిపేందుకు అనుమతివ్వాలని కోరింది. కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడుపుతామని స్పష్టం చేసింది. 

నష్టాల బాట ఇలా.. 
నగరంలోని ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ఆయా రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రయాణికుల చార్జీల ద్వారా కేవలం 45 శాతమే ఆదాయం సమకూరేది. మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో.. 50 శాతం రియల్‌ ఎస్టేట్, మాల్స్, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సంస్థ సమకూర్చుకోవాల్సి ఉంది. కోవిడ్‌ మహమ్మారి పంజా విసరడంతో సర్వీసులు నిలిపివేయడం, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు నెలకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా నిలిచిపోయింది. నగరంలో 18 మాల్స్‌ నిర్మించాలనుకున్న సంస్థ డిమాండ్‌ లేకపోవడంతో 4 మాల్స్‌ మాత్రమే నిర్మించింది. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల ద్వారా ఆదాయం ఆర్జించాలనుకున్న సంస్థ ఆశలు తలకిందులయ్యాయి. దీంతో నష్టాల జర్నీతో ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ అష్టకష్టాలు పడుతోంది. సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో 2019– 20 ఆర్థిక సంవత్సరంలో రూ.382.21 కోట్లు నష్టపోయామని వెల్లడించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.598.20 కోట్ల రెవెన్యూ ఆర్జించలేకపోయినట్లు ప్రకటించడం గమనార్హం. 

రైళ్లు నడుపుతాం.. అనుమతించండి.. 
కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం రైళ్లను నడిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని తాజా లేఖలో కోరింది. స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చూడడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చర్యలు చేపడతామని పేర్కొంది. మెట్రో రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేయాల్సి ఉందని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement