
మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక ఉత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది.
సాక్షి, హైదరాబాద్: మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక ఉత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. విభిన్న సంస్కృతులు, కళల సమాహారమైన నగరంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్కృతీ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.
విశిష్టమైన భారతీయ సంస్కృతిని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీత ప్రదర్శనలను సమున్నతంగా ఆవిష్కరించనున్నారు. సుమారు వెయ్యి మంది కళాకారులు, పాకశాస్త్ర నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. (క్లిక్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు)
మొదటి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు. (క్లిక్: పోలీసులకే పంచ్ వేసిన నెటిజన్)