సాక్షి, అమరావతి: యువత బలహీనతలు సోషల్ మీడియా సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తూ యూజర్ల రక్షణ, హానికర కంటెంట్‌ను అరికట్టడంలో అవి అలక్ష్యం వహిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు తమకు వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికే పనిచేస్తున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనం వెల్లడిస్తోంది.
తాజా నివేదిక ప్రకారం..2022లో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ఏకంగా రూ.91,541 కోట్లను సోషల్ మీడియా సంస్థలు ఆర్జించాయి. ఇందులో 12 ఏళ్లలోపు కేటగిరీలో ఏకంగా రూ.17,476 కోట్లు ప్రకటనల రాబడి ఉండటం విశేషం. స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం 30–40% యువ యూజర్ల వీక్షణల ద్వారా సోషల్ మీడియా సంస్థలకు సమకూరుతోంది. ఈ ట్రెండ్ ఏటా పెరుగుతూనే ఉంది. ఈ లెక్కన కొత్త సంవత్సరంలో వీటి ఆదాయంలో మరింత వృద్ధి కనిపించనుంది.
స్నాప్‌చాట్‌కు అధిక రాబడి: హార్వర్డ్ వర్సిటీ బృందం అమెరికాలోని ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్ వినియోగదారులపై పరిశోధన చేసింది. 12 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ప్రకటనల ద్వారా యూట్యూబ్ రూ.7,983 కోట్లు, ఇన్‌స్ట్రాగామ్ రూ.6,676 కోట్లు, ఫేస్‌బుక్ రూ.1,140 కోట్లను రాబట్టినట్లు నివేదిక పేర్కొంది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల వినియోగంలో టిక్‌టాక్ రూ.16,644 కోట్లు, యూట్యూబ్ రూ.9,986 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆర్జనలో స్నాప్‌చాట్ 41%, టిక్‌టాక్ 35%, యూట్యూబ్ 27%, ఇన్‌స్ట్రాగామ్ 16% వాటా ఉన్నట్లు వెల్లడించింది.
దేశంలోనూ గణనీయంగా వృద్ధి: భారత్‌లో సగటు వ్యక్తి సోషల్ మీడియా వినియోగం రోజుకు 192 నిమిషాలుగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్) స్థూల ప్రకటనల ఆదాయం రూ.18,308 కోట్లుగా నమోదైంది. ఇది 2022 ఆర్థిక సంవ్సతరంతో పోలిస్తే 13% వృద్ధి చెందింది. త్వరలోనే మెటా యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెడిసీర్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ ప్రకటనల విలువ 2020లో రూ.24,966 కోట్ల నుంచి 2030కి రూ.2.91 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
దేశీయంగా ఇన్‌స్ట్రాగామ్ ప్రకటనల కోసం ప్రతి క్లిక్‌కి సగటున రూ.66.06 వసూలు చేస్తోంది. టెక్ కంపెనీల నుంచి ఎక్కువ పారదర్శకత ఉండాలన్నా..యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను అరికట్టాలన్నా ప్రభుత్వ జోక్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటే చిన్నా రులు, యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుని వచ్చే హాని కరమైన ప్రకటన పద్ధతులను తగ్గించవచ్చని వీరు అభిప్రా యపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా డిజిటల్, సోషల్ మీడియా నియంత్రణలపై డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment