సాక్షి, హైదరాబాద్: హవాయి చెప్పులు వేసుకునే సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్రమోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
2047 నాటికి అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా, ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ అవతరించిందని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2047 నాటికి విమానయాన రంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.
తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి: ఇస్లాం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌ను మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేలా, మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిపించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment