సాక్షి, న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. రష్యా వైఖరిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉంది. వారిని స‍్వదేశానికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని స్పష్టం చేశారు. భారతీయులను స్వదేశానికి తరలించేందకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. వారిని సురక్షితంగా భారత్‌కు చేరుస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ వెళ్లిన ప్రత్యేక విమానాలు తిరిగి రావడానికి, అక్కడికి విమానాలు వెళ్లడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాగా, గగనతలం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను పంపి భారతీయులకు స‍్వదేశానికి తరలిస్తామన్నారు. ఇప్పుడు కూడా మన దేశ పౌరులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment