సాక్షి, హైదరాబాద్: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు.
ఏమని చెప్పాలి..
‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు.
చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ.
మా కష్టాలు మీకేం తెలుసు?
మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి.
నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్‌ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు..
Comments
Please login to add a commentAdd a comment