ఐఏఎంసీ లోగోను ఆవిష్కరిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వంతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చిట్టచివరి ప్రత్యామ్నాయంగానే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభించనున్న సందర్భంగా శనివారం నగరంలోని హెచ్‌ఐసీసీలో భాగస్వామ్యపక్షాలతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సుకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
నంబర్ వన్ నగరం హైదరాబాద్...
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నా ఇక్కడ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ఆర్టిట్రేషన్ అండ్ మీడియేషన్ కేంద్రాలు పారిస్, సింగపూర్, లండన్, హాంకాంగ్‌లలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అనేక కారణాలున్నాయి.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే, రోడ్డు రవాణా మార్గాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరా. ఆరు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది.
ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి (అప్పటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ హిమాకోహ్లి, కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం భూమి కేటాయించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ
‘‘ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా చట్టాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. తీర్పులు చెప్పడానికి కోర్టులే అవసరం లేదు. లా పట్టాలు తీసుకొని న్యాయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా న్యాయం చేయొచ్చు. తప్పొప్పులు తెలుసుకొని ఎవరైనా తీర్పు చెప్పొచ్చు. సామాన్యులకు సైతం ఆర్బిట్రేషన్ కేంద్రాలతో న్యాయం జరగాలి.
సమస్యను అర్థం చేసుకొనే శక్తి ఉన్నవాళ్లు, విశ్వసనీయత ఉన్నవాళ్లు తీర్పులు చెప్పొచ్చు. గరికపాటి లాంటి అవధానులు, గుర్తింపు పొందిన వక్తలు ఆర్బిట్రేషన్ కేంద్రం ప్యానల్‌లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నా. అలాగే పెద్దలు, విజ్ఞులు పాల్గొని అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇరురాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రచ్చబండలాంటిదే: సీఎం కేసీఆర్
దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో మధ్యవర్తిత్వం ఎప్పటి నుంచో ఉంది. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం. ఈ కేంద్రంలో వ్యాపారుల మధ్య వివాదాలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఏఐఎంసీ కోసం తాత్కాలికంగా 25 వేల చదరపు అడుగులు కేటాయించాం. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఉత్తమ ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చాం: మంత్రి కేటీఆర్
‘‘ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చాం. దీని ద్వారా 15 రోజుల్లోనే ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు లభిస్తాయి. పరిశ్రమలకు ఆ గడువులోగా అనుమతులు రాకపోతే అనుమతి వచ్చినట్లు భావించవచ్చు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే ఐఏఎస్ అధికారులకూ జరిమానా విధించేలా మార్గదర్శకాలను రూపొందించాం. ఈ విధానం ద్వారా 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం.
తద్వారా రూ. 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. పరోక్షంగా అంతకు రెండింతల మందికి ఉపాధి లభించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ద్వారా మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వివాదాల పరిష్కారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేస్తుంది’’ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.
చరిత్రాత్మక ఘట్టం: ఒవైసీ
‘హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ఓ చరిత్రాత్మక ఘట్టం. దేశంలోని కోర్టుల్లో పెద్ద ఎత్తున పెండింగ్ కేసుల్లా కాకుండా మధ్యవర్తిత్వం, మీడియేషన్‌లో అంతర్జాతీయ రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నా’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment