సాక్షి, హైదరాబాద్: కార్వీ గ్రూప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి హైకోర్టు సింగిల్ జడ్జి రెండు నెలల సమయం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. ఖాతాదారులకు చెందిన షేర్లను తాకట్టు పెట్టి రుణం పొంది వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలపై కార్వీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ... షేర్లు, భూములు, భవనాలు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేయడం తెలిసిందే.
దీన్ని సవాల్ చేస్తూ సంస్థ సీఎండీ పార్థసారథి సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ ఆస్తుల జప్తు నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి 2 నెలల సమయం ఇచ్చారు. ఈ తీర్పును తప్పుబడుతూ ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అథారిటీ 180 రోజుల్లో రిపోర్టు అందజేయాల్సి ఉంటుందని, అదనంగా సమయం ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సమయ వెసులుబాటు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన రెండు నెలల గడువు మరో వారంలో ముగియనుండగా ఇప్పడు సవాల్ చేయడాన్ని తప్పుబడుతూ అప్పీల్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment