సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన చాంబర్‌లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు.
సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.
సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా.
నాలుగు ద్వారాలు
నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పు ద్వారాన్ని (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహా్వనితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్–వెస్ట్) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు.
ఈశాన్య (నార్త్–ఈస్ట్) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్–ఈస్ట్) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్‌తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయ రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
సమీక్షలో సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు...
♦ ఖాళీ జాగలున్న వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలి.
♦ పోడు భూముల పట్టాల పంపిణీని త్వరలో ప్రారంభించాలి.
♦ దళితబంధు పథకాన్ని కొనసాగించాలి.
♦ గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలి.
Comments
Please login to add a commentAdd a comment