సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్ట విధులు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్‌లోనే ఈ నిధులు కేటాయిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, పంచాయతీలు నిధులను వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందన్నారు. దీన్ని సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను క్రియాశీలం చేస్తామని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్‌లో స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు.
విధులు, బాధ్యతలు...
‘స్థానిక సంస్థల బలోపేతం ప్రభుత్వ విధాన నిర్ణయం. దాన్ని అమలు చేస్తున్నం. ఇందులో ఆర్థిక సంఘం.. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్ యార్డులు, నర్సరీలు, వైకుంఠ ధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తం. వీటిని నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే జెడ్పీలు, ఎంపీపీలకు విధులు అప్పగించాలి. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జెడ్పీ చైర్ పర్సన్లతో నేనే స్వయంగా చర్చిస్తా. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటం. మొత్తంగా జిల్లా, మండల పరిషత్‌లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది’అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: (సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్‌ఆర్టీసీ)
సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
ఆ నిధులు వినియోగించుకోవచ్చు...
‘గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టినం. కానీ కొన్ని చోట్ల రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నరు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉంది. ఎవరి జోక్యం అక్కరలేదు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలి’అని కేసీఆర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పీఆర్ కమిషనర్ రఘునందన్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment