ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు.
లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ..
ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్‌లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది.
సిబ్బంది కొరత..
ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది.
ప్రతి శనివారం మేళా..
లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్‌లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
లైసెన్స్‌లు తప్పనిసరి..
ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది.
– కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment