సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ కొనియాడారు.
శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి.. ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోస్థైర్యం నిరూపించిందన్నారు కేటీఆర్. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమన్న ఆయన.. రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం కమ్ముకుంది. కానీ, చెదరని గుండె నిబ్బరంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారామె. ఆత్మవిశ్వాసంతో ఆమె రాసిన కవితలు మంచి ఆదరణ పొందాయి.
‘‘సంకల్పం ముందు వైకల్యం ఎంత!.
ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!.
ఎదురీత ముందు విధిరాత ఎంత!.
పోరాటం ముందు ఆరాటం ఎంత!.. అంటూ రాజేశ్వరి ఓ కవిత రాసిందామె. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి ‘‘జీవితమే కవిత్వం..’’ అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే. కానీ అమె మాత్రం జీవిస్తుంది.. అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం అంటూ పేర్కొన్నారు.
సంబంధిత వార్త: కాళ్లతో కవితలు రాసిన ‘సిరిసిల్ల’ రాజేశ్వరి ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment