రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్లే రైతుల ఆత్మహత్యలు: కేటీఆర్
ఈ నెల 24 నుంచి బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ పర్యటన
గ్యారంటీల అమలుపై గ్రామసభల్లో జనం నిలదీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై తమ పార్టీ వేసిన అధ్యయన కమిటీ వెనుక రైతు సంక్షేమం తప్ప ఎలాంటి రాజకీయం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, హామీల అమలులో వైఫల్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ అధ్యయన కమిటీ తొలి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, యాదవరెడ్డి, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్య యాదవ్, రసమయి బాలకిషన్, పువ్వాడ అజయ్ కుమార్‌తో జరిగిన భేటీలో రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, ఇతర రైతాంగ సమస్యలపై చర్చించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఆదిలాబాద్ బ్యాంకులో రైతు ఆత్మహత్య ఘటనకు స్పందించి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అధ్యయన కమిటీ వేశాం. ఈ నెల 24 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిటీ పర్యటన ప్రారంభమవుతుంది.
రుణమాఫీ, కరెంటు సరఫరా, సాగు తీరు, మద్దతు ధర, బోనస్, కొనుగోలు కేంద్రాలు, రైతు వేదికల పనితీరు వంటి అంశాలపై అధ్యయనం చేస్తుంది. రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేసి కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుంది’అని కేటీఆర్ చెప్పారు.
అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు
‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు అధికారం ఇస్తే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. రైతాంగం పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుందనే అపోహతో కాంగ్రెస్ పనిచేస్తోంది.
ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తున్నారు. హైకోర్టు తీర్పు మేరకు నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ గ్యారంటీల అమలుపై జనం గ్రామసభల్లో గల్లా పట్టి కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు గ్రామసభల్లో టెంట్లను పీకేస్తున్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని గ్రామసభలు నిరూపిస్తున్నాయి’అని కేటీఆర్ అన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భవిష్యత్తులో సత్తుపల్లిలో తిరిగి బీఆర్‌ఎస్ విజయం సాధించడంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment