
షేక్‌పేట్ మండలకార్యాలయంలోఓటు వేస్తున్న మంత్రి కేటీఆర్
బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ఎవరో మహానుభావుడు చెప్పినట్లు ఓటేసే ముందు ఇంట్లో సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చానని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం నిర్వహించగా మంత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 39% మంది మాత్రమే ఎమ్మెల్సీ ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈసారి పోలింగ్ శాతం పెరిగాల్సిన అవస రం ఉందన్నారు. విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనరన్న అపవాదును తొలగించుకోవాలన్నారు.
విద్యావంతులకు కృతజ్ఞతలు...
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యావంతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ఈ హక్కుని వినియోగించుకోవాలని చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ అభ్యర్థిగా పోటీ చేసిన వాణీదేవి విజయం ఖాయమని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు అన్నారు.